Sep 29,2023 20:18

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అదానీ గ్రూప్‌ అధినేత గౌతం అదానీ భేటీ ఎందుకు జరిగిందో ప్రజలకు బహిర్గతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్‌ చేశారు. వారి భేటీ వ్యక్తిగతమా? లేక వ్యవస్థీకృత భేటీనా? అని ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చే పేరుతో అదానీ జగన్‌తో నాలుగు గంటలపాటు భేటీ అయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే గంగవరం, కృష్ణపట్నం పోర్టులను, సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులను అదానీ కంపెనీలకే కట్టబెట్టారని తెలిపారు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాట్లు కూడా ఎక్కువ ధరకు అదానీకే కట్టబెట్టారన్నారు. ముఖ్యమంత్రితో జరిగే ప్రముఖల భేటీని సిఎంఒ రహస్యంగా ఎందుకు వుంచిందో చెప్పాలన్నారు. భేటీ వివరాలను మీడియాకు వెల్లడించకుండా రహస్యంగా వుంచడంతో పలు అనుమానాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.