Apr 02,2023 12:18

గుజరాత్‌ : భారత తొలి తరం దిగ్గజ క్రికెటర్‌.. అర్జున అవార్డు గ్రహిత సలీమ్‌ దురానీ(88) ఆదివారం ఆయన కన్నుమూశారు. దురానీ చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం గుజరాత్‌లో జామ్‌నగర్‌లో తుదిశ్వాస విడిచారు.
దురానీ 1934, డిసెంబర్‌ 11న అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌ జన్మించారు. తన 8 నెలల వయస్సులో ఆయన కుటుంబం కరాచీకి వలస వచ్చి స్థిరపడింది. 1947లో భారత్‌-పాక్‌ విభజన అనంతరం దురానీ కుటుంబం భారత్‌కు వచ్చేసింది. 1960లో ముంబైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో భారత్‌ తరఫున అరంగేట్రం చేశారు. 1960-70 దశకంలో భారత జట్టులో నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా గుర్తింపుపొందారు. 1961-62లో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ 2-0తో గెలవడంలోనూ కీలక పాత్ర పోషించారు. 1971లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ చారిత్రక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. భారత్‌ తరఫున దురానీ 29 టెస్టు మ్యాచ్‌లు ఆడి ఒక శతకం, 7 అర్ధ సెంచరీలతో మొత్తం 1,202 పరుగులు చేశారు. అదేవిధంగా 75 వికెట్లు పడగొట్టారు.
1973లో క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన దురానీ తర్వాత బాలీవుడ్‌లో అడుగు పెట్టారు.. నటుడు ప్రవీన్‌ బాబీతో కలిసి 'చరిత్ర' సినిమాలో పనిచేశారు. అర్జున అవార్డును అందుకున్న తొలి క్రికెటర్‌ సలీమ్‌ దురానీ (1960)నే కావడం విశేషం. దురానీ మృతిపట్ల మాజీ క్రికెటర్‌, మాజీ కోచ్‌ రవిశాస్త్రి, వీవీఎస్‌ లక్ష్మణ్‌ సంతాపం ప్రకటించారు.