ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : అఖిల భారత భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సమాఖ్య ( బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) కౌన్సిల్ సమావేశాలు గురువారం నుంచి 4 రోజుల పాటు నెల్లూరులోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి భవన్‌లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. తొలి రోజు ర్యాలీ, బహిరంగసభ, మిగతా మూడు రోజులు ప్రతినిధుల సభ జరగనుంది. అన్ని రాష్ట్రాల నుంచి 140 మంది సభ్యులు హాజరుకానున్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. జాతీయ సమావేశాల సందర్భంగా నగరంలోని విఆర్‌సి, రామలింగాపురం, ముత్తకూరు, చిల్డ్రన్స్‌పార్క్, అపోలో సెంటర్‌లో స్వాగత ఏర్పాట్లు చేశారు.
గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు స్థానిక విఆర్‌సి గ్రౌండ్ నుంచి ర్యాలీ ప్రారంభవుతుంది. రామలింగాపురం సెంటర్ మీదుగా ముత్తుకూరు గేట్ వద్దకు చేరుకుంటుంది. అక్కడే బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో సిడబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షులు కె. హేమలత, ప్రధాన కార్యదర్శి యుపి జోసఫ్, ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు తదితరులు పాల్గొంటారు.










