Oct 01,2020 18:40

ధర్నాలో మాట్లాడుతున్న లక్ష్మీనారాయణ



వెల్ఫేర్‌ బోర్డు నిధుల్ని తిరిగి జమ చేయాలి
- కలెక్టరేట్‌ ఎదుట బిల్డింగ్‌ వర్కర్లు ధర్నా
ప్రజాశక్తి-గుంటూరు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 17 పేరుతో అక్రమంగా పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కి రూ.450 కోట్ల తరలించడాన్ని నిరసిస్తూ, రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు భవన నిర్మాణ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ నూతన ఇసుక పాలసీ, కోవిడ్‌ వల్ల పనులు కోల్పోయి కుటుంబాలు గడవక కార్మికులు ఇబ్బంది పడుతుంటే, ప్రభుత్వం ఆదుకోకపోగా, సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను అక్రమంగా దారి మళ్ళించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈప్రభుత్వం కూడా కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన బోర్డు నిధుల్ని దారి మళ్లిస్తుందని విమర్శించారు. తక్షణమే దారి మళ్లించిన రూ.450 కోట్లను తిరిగి బోర్డుకు జమ చేయాలని, ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులకు రూ.10వేల ఆర్థిక సాయం చేయాలని, పెండింగ్‌లో ఉన్న రూ.6.5 కోట్ల విలువైన క్లైమ్స్‌ పరిష్కరించాలని, బోర్డులో కొత్త వారు చేరటానికి అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎఐటియుసి అనుబందది నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెల్ల క్రితం కార్మికులకు ఆర్థిక సాయం చేస్తామని ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్లు తీసుకున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎఫ్‌టియు నాయకులు రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందని అన్నారు. ధర్నాకు చింతల శ్రీను, కె.సాంబయ్య అధ్యక్షత వహించారు. ధర్నాకు సిఐటియు నాయకులు కె.శ్రీనివాస్‌, యం.భాగ్యరాజు, షేక్‌. హుస్సేన్‌ వలి, కె.శివ, చల్లా సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ో మాట్లాడుతున్న కమిషనర్‌