ప్రజాశక్తి-గుంటూరు :స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరు నగరం జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. కేంద్ర పర్యావరణ శాఖ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్.క్యాప్) జాతీయ స్థాయిలో చేపట్టిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరు నగరానికి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ నుండి నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి అవార్డును గురువారం అందుకున్నారు. దక్షిణ భారతదేశంలో గుంటూరు నగరానికే ఈ అవార్డు రావడం విశేషం. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 131 నగరాలు పోటీపడ్డాయని, అందులో 10 లక్షలలోపు జనాభా కేటగిరీలో నగరానికి 3వ ర్యాంకు దక్కిందని తెలిపారు. పది లక్షలలోపు జనాభా కేటగిరీలో మొదటి స్థానంలో అమరావతి (మహారాష్ట్ర), రెండో స్థానంలో మోర్దాబాద్ (ఉత్తరప్రదేశ్) నిలిచాయన్నారు. గతంలో కూడా సిటిజన్ పర్స్పెషన్ సర్వేలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్థానాన్ని గుంటూరు నగరపాలక సంస్థ సాధించిందని తెలిపారు. త్వరలో పారిశుధ్య నిర్వహణపై స్థానిక ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. అవార్డు రావడంలో కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.