Nov 17,2020 21:18

మంత్రి పెద్దిరెడ్డి ఇల్లు ముట్టడికి యత్నం
భవన నిర్మాణ కార్మికుల అరెస్టు, విడుదల
ప్రజాశక్తి - పుత్తూరు అర్బన్‌ :
'సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులు సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మంత్రి పెద్దిరెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే పోలీసులు నాయకులను అరెస్టు చేసి, సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర పిలుపు మేరకు భవన నిర్మాణ కార్మికులు ఉదయం 9 గంటలకు ఎంఆర్‌పల్లి సర్కిల్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు మంత్రి ఇంటికి పోవడానికి వీల్లేదని అడ్డుకున్నారు. అయితే యూనియన్‌ నేతలు ర్యాలీగా బయల్దేరడంతో ఆగ్రహించిన పోలీసులు వారిని అరెస్టు చేసి ఎస్వీ యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మురళి, ఐఎఫ్‌టియు నగర కార్యదర్శి వైఎస్‌ మణి మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మంత్రికి తమ మొర వినిపించుకుందామని వెళుతుంటే పోలీసులు అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. భవన నిర్మాణానికి సంబంధించి దాదాపు 36 రంగాలకు సంబంధించిన కార్మికులు సంక్షేమ బోర్డు నుంచి లబ్ది పొందుతున్నారని, అయితే సంక్షేమ బోర్డును ఎత్తేసి కులాల కార్పొరేషన్‌కు నిధులను మళ్లించడం ఏంటని ప్రశ్నించారు. జీవో నంబర్‌ 17 పేరుతో 450 కోట్ల రూపాయల నిధులను నిర్వీర్యం చేసే కుట్ర మానుకుని సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. జిబిఎస్‌ మణ్యం, శ్రీరాములు, కెవై రాజా, కె.రాధాక్రిష్ణ, శివ, ఎస్‌కె బాష, సిహెచ్‌ శివ, రవి, హరి, క్రిష్ణమూర్తి, తంజావూరు మురళి, బాలసుబ్రమణ్యం, సుబ్రమణ్యం, లక్ష్మి, చిన్నా, నారాయణబాబు, ఎన్‌డి శ్రీను, రెడ్డెప్ప, విజరుకుమార్‌ అరెస్టు అయ్యారు.
పుత్తూరు అర్బన్‌ : పుత్తూరులో సిఐటియు, ఎఐటియుసి సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి ర్యాలీగా డిప్యూటీ సిఎం ఇంటికి ప్రదర్శనగా బయల్దేరారు. అయితే పోలీసులు ర్యాలీని మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో నాయకులు వెంకటేష్‌, కోదండయ్యలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం సిఐ వెంకట్రామిరెడ్డి చొరవతో నాయకులు పది మందిని డిప్యూటీ సిఎం ఇంటికి వెళ్లడానికి అనుమతించారు. అనంతరం డిప్యూటీ సిఎం ఇంటి వద్ద నాయకులు వినతిపత్రం అందించారు.మునిరాజ, ఎన్‌డి శ్రీను, కోదండయ్య, చిరంజీవులు, చంద్రబాబు, పెరుమాల్‌, చంద్రయ్య, దేశయ్య, చెంగల్రాయులు పాల్గొన్నారు. సిఎం దృష్టికి సమస్యను తీసుకెళతానని నాయకులకు డిప్యూటీ సిఎం నారాయణస్వామి హామీ ఇచ్చారు.