- లక్నోపై 12 పరుగుల తేడాతో గెలుపు..
- రుతురాజ్ మరో అర్ధశతకం
చెన్నై: చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 12 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 217పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్లు నష్టపోయి 205 పరుగులే చేయగల్గింది.
తొలుత చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(57) అర్ధసెంచరీకి తోడు మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(47) బ్యాటింగ్‌లో రాణించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 9.1 ఓవర్లలో 110 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెల కొల్పారు. ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్(57) ఈ ఐపిఎల్‌లో రెండో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కృష్ణప్ప గౌతమ్ వేసిన 5వ ఓవర్‌లో మూడు సిక్సర్లు కొట్టిన రుతురాజ్... కృనాల్ పాండ్యా వేసిన 8వ ఓవర్‌లో సింగిల్ తీసి అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 25 బంతుల్లోనే 2ఫోర్లు, 4సిక్సర్ల సాయంతో అర్ధ శతకాన్ని బాదాడు. ఆ తర్వాత శివం దూబే(27), మొయిన్ అలీ(19)కూడా బ్యాటింగ్‌లో రాణించారు. చివర్లో అంబటి రాయుడు(27) ధాటిగా ఆడగా.. మార్క్ వుడ్ వేసిన ఆఖరి ఓవర్‌లో కెప్టెన్ ఎంఎస్ ధోనీ(12) వరుసగా రెండు సిక్సర్లు బాది ఔటయ్యాడు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోరు, మార్క్ వుడ్ తలా మూడు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్‌కు ఒక వికెట్ లభించింది.
ఛేదనలో లక్నో జట్టుకు అదిరే ఆరంభం లభించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్- మయర్స్(53) కలిసి తొలి వికెట్‌కు 5.3 ఓవర్లలోనే 79పరు గుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మయర్స్ కేవలం 21 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత లక్నో జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్‌లో పూర న్(32) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించాడు. మొయిన్‌కు నాలుగు, దేశ్‌పాండేకు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మొయిన్ అలీకి లభించింది.
5 వేల క్లబ్‌లో ధోని
చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపిఎల్‌లో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. మార్క్ వుడ్ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాది అతను ఈ రికార్డుకు చేరుకున్నాడు. ఇప్పటి వరకు ఐపిఎల్‌లో ఐదుగురు 5వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, వార్నర్, రోహిత్ ఈ ఫీట్ సాధించారు.










