Apr 05,2023 10:46
  • సాయి సుదర్శన్‌ అర్ధసెంచరీ
  • ఢిల్లీపై ఆరు వికెట్ల తేడాతో గుజరాత్‌ గెలుపు


న్యూఢిల్లీ : ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జట్టు ఆరు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఛేదనలో గుజరాత్‌ జట్టు 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 163 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. గుజరాత్‌ జట్టులో సాయి సుదర్శన్‌(62నాటౌట్‌) అర్ధసెంచరీకి తోడు విజరు శంకర్‌(29), డేవిడ్‌ మిల్లర్‌ (31నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(37) రాణించినా.. పృథ్వీ షా(7), మిఛెల్‌ మార్ష్‌(4), నిరాశపరిచారు. మిచెల్‌ మార్ష్‌, పృథ్వీ షాలను షమీ బౌల్డ్‌ చేశాడు. దీంతో 37 పరుగుల్లోపే ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత డేవిడ్‌ వార్నర్‌(37), సర్ఫరాజ్‌ ఖాన్‌ (30) ఢిల్లీ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. అల్జారీ జోసెఫ్‌ ఒకే ఓవర్‌లో వార్నర్‌, రిలే రూస్సోలను ఔట్‌ చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు 67 పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో అభిషేక్‌ పొరెల్‌(20) ధాటిగా ఆడాడు. చివర్లో అక్షర్‌ పటేల్‌(36) మెరుపులు మెరిపించాడు. గుజరాత్‌ బౌలర్లలో షమీ, రషీద్‌ ఖాన్‌ తలా మూడు వికెట్లు తీశారు. అల్జారీ జోసెఫ్‌కు ఒక వికెట్‌ దక్కింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సాయి సుదర్శన్‌కు లభించింది.

11

 

22