Feb 12,2023 22:15

బెంగళూరు: సౌరాష్ట్ర, బెంగాల్‌ జట్లు 2022-23 సీజన్‌ రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇందౌర్‌లో మధ్యప్రదేశ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో బెంగాల్‌ 306 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లగా.. కర్ణాటకతో జరిగిన రెండో సెమీస్‌లో సౌరాష్ట్ర నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. సుదీప్‌ ఘరామి (112), అనుస్తుప్‌ మజుందార్‌ (120) శతకాలకు అభిషేక్‌ పోర్నెల్‌ (51), మనోజ్‌ తివారీ (42) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 438 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం ఆకాశ్‌ దీప్‌ (5/42), షాబాజ్‌ అహ్మద్‌ (2/30) బంతితో విజఅంభించడంతో మొదటి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ 170 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 279 పరుగులు చేసింది. 548 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ 241 పరుగులకు ఆలౌటైంది. దీంతో బెంగాల్‌ భారీ విజయం సాధించింది.
సౌరాష్ట్రతో జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (249) డబుల్‌ సెంచరీ బాదడంతో తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటక 407 పరుగులకు ఆలౌటైంది. అనంతరం కెప్టెన్‌ అర్పిత్‌ వసవాడ డబుల్‌ సెంచరీ (202)కి తోడు షెల్డన్‌ జాక్సన్‌ (160) శతకం బాదడంతో మొదటి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 527 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కర్ణాటక 234 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం 115 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర ఆరు వికెట్లు నష్టపోయి ఛేదించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ టోర్నీలో సౌరాష్ట్ర ఫైనల్‌కు చేరుకోవడం ఇది ఎనిమిదోసారి. గత మూడు నాలుగు సీజన్లలో మూడోసారి. ఫిబ్రవరి 16-20 మధ్య కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో టైటిల్‌ పోరు జరుగనుంది.