ఆసీస్ ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ట్యాంపరింగ్‌తోనే తొలి ఇన్నింగ్స్‌లో ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీని ఆసీస్ అవుట్ చేసిందని అలీ ఆరోపించాడు. కొత్త బంతితో 16 ఓవర్లు వేసిన ఆసీస్ బౌలర్లు దాని షేప్ మారిపోయిందని వేరే బంతి తీసుకున్నారని, ఈ మ్యాచ్‌లో వాడుతున్న డ్యూక్స్ బాల్ చాలా బలంగా ఉంటుందని చెప్పిన అలీ.. ఊరికినే అది షేప్ మారదన్నాడు. అలాగే పుజారా అవుటైన డెలివరీని జాగ్రత్తగా గమనిస్తే.. బంతి షైనింగ్ ఉన్న వైపుకే బంతి వచ్చిందన్నాడు. దీన్నే రివర్స్ స్వింగ్ అంటామని, కానీ 14వ ఓవర్లోనే డ్యూక్స్ బాల్ రివర్స్ స్వింగ్ అవడం అసాధ్యం అని అన్నాడు. 'అసలు ఏ బంతి అయినా కేవలం 15-20 ఓవర్లు వేయగానే రివర్స్ స్వింగ్ అవుతుందా? కూకబుర్రా బంతి అయితే అవ్వొచ్చేమో? అనుకోవచ్చు. కానీ డ్యూక్స్ బాల్ చచ్చినా అవ్వదు. కనీసం 40 ఓవర్ల వరకు అది బాగానే ఉంటుంది. ఆ తర్వాతే ఏమైనా రివర్స్ స్వింగ్ దొరుకుతుంది. కళ్ల ముందు ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు' అని అలీ పేర్కొన్నాడు. ఆసీస్ జట్టుపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు రావడం ఇదేం కొత్త కాదు. దక్షిణాఫ్రికాతో 2018లో టెస్టు మ్యాచ్ గెలిచేందుకు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ తదితరులు బాల్ ట్యాంపరింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కారు. ఈ క్రమంలోనే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా ఆసీస్ టీ ఇలాంటి తప్పే చేసిందని వార్తలు రావడంతో ఫ్యాన్స్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.










