Oct 10,2023 14:36

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు తదుపరి విచారణ ఉంటుందని ధర్మాసనం వెల్లడించింది. మంగళవారం కూడా ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అనిరుద్‌ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేది నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం విచారణ కొనసాగించింది. ఇరుపక్షాల న్యాయవాదులు హోరాహోరీగా వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదించగా, సిఐడి తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రధానంగా 17 ఎ చుట్టూనే వాదనలు జరిగాయి. తొలుత గంటపాటు న్యాయవాది హారీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. అనంతరం న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రజా ధనం దుర్వినియోగం అయిందని, చంద్రబాబు చర్యలతో ఎపికి నష్టం జరిగిందని వాదించారు. సుదీర్ఘంగా వాదనలు జరగడంతో జోక్యం చేసుకున్న ధర్మాసనం వాదనలు వినిపించేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందని అడగ్గా, మరో గంటపాటు పడుతుందని ముకుల్‌ రోహత్గీ తెలిపారు. మిగతా వాదనలు శుక్రవారం వింటామని ధర్మాసనం అనగా, అందుకు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థలూథ్రా జోక్యం చేసుకుని 'ఈ రోజే వాదనలు పూర్తి చేయాలి' అని అన్నారు. చాలా కేసులు ఉన్నాయని, వినేందుకు సమయం లేదని ధర్మాసనం పేర్కొంది. శుక్రవారం వాదనలు వినిపిస్తామని ముకుల్‌ రోహత్గీ అనగా, చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్థ లూథ్రా గురువారానికి వాయిదా వేయాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది.