చెన్నై : నటి త్రిష పై నటుడు మన్సూర్ అలీఖాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గన్న ఆయన.. 'లియో'లో త్రిషతో ఓ సీన్ గురించి వ్యాఖ్యానించారు. ''గతంలో ఎన్నో చిత్రాల్లో నేను రేప్ సీన్లలో నటించా. 'లియో'లో ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నా. కాకపోతే, అలాంటి సీన్ లేకపోవడం బాధగా అనిపించింది'' అని మన్సూర్ అలీఖాన్ అన్నారు. మన్సూర్ వ్యాఖ్యలపై కోలీవుడ్ సెలబ్రిటీలంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో ... మన్సూర్ స్పందిస్తూ ... త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందన్నారు. ఆమెను గౌరవిస్తున్నానని చెప్పారు. తాను సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదన్నారు.
త్రిష ఆగ్రహం..
మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోనందుకు ఆనందంగా ఉందన్నారు. ''మన్సూర్ అలీ ఖాన్ నా గురించి అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దఅష్టికి వచ్చింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అతడి లాంటి క్రూరమైన వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోనందుకు సంతోషంగా ఉంది. నా ఫిల్మ్‌కెరీర్‌లో ఇలాంటి వారితో నటించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటా. ఇలాంటి వారి వల్లే మానవాళికి చెడ్డపేరు వస్తోంది'' అని త్రిష ట్వీట్ చేశారు.
సెలబ్రిటీల ఆగ్రహం...
'లియో' దర్శకుడు లోకేశ్ కనగరాజ్, నటి మాళవికా మోహనన్, గాయని చిన్మయి వంటి సెలబ్రిటీలు సైతం మన్సూర్ ప్రవర్తనను తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు తమని ఆగ్రహానికి గురి చేశాయన్నారు. తోటి కళాకారులు, మహిళలను గౌరవించకపోవడం బాధాకరంగా ఉందంటూ పోస్టులు పెట్టారు.