- 15వ ర్యాంకర్‌కు ఝలక్
- రెండోరౌండ్‌కు శ్రీకాంత్
- స్పెయిన్ మాస్టర్స్ సూపర్-300
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో ఆకర్షీ కశ్యప్ సంచలన విజయం సాధించింది. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో ఆకర్షీ 12-21, 21-15, 21-18తో 15వ ర్యాంకర్, కెనడాకు చెందిన మిచ్ఛెలీకి ఝలక్ ఇచ్చింది. తొలి గేమ్‌ను ఓడిన ఆకర్షీ.. రెండు, మూడు గేమ్‌లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ 51నిమిషాలసేపు సాగింది. టాప్-15 క్రీడాకారిణిని ఆకర్షీ కశ్యప్ ఓడించడం ఇదే తొలిసారి. ఇక కిదాంబి శ్రీకాంత్ 21-11, 25-27, 23-21తో థమ్మసిన్ సిత్తికోమ్(థారులాండ్)పై, బి. సాయిప్రణీత్ 21-16, 18-21, 21-12తో జాన్ లౌడా(చెక్ రిపబ్లిక్)పై చెమటోడ్చి నెగ్గారు. కిదాంబి శ్రీకాంత్ తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచినా.. రెండో గేమ్‌లో పోరాడి ఓడాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో విజయం ఇరువురిని ఊరించినా.. చివరకు శ్రీకాంత్ గెలిచి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లాడు. ఈ మ్యాచ్ సుమారు గంటా 5నిమిషాలసేపు సాగింది. మరో పోటీలో జార్జి 21-16, 21-14తో భారత్‌కే చెందిన మంజునాథ్‌పై గెలిచి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లాడు. మరో పోటీలో ప్రియాంశు 18-21, 21-16, 21-11తో స్వెండ్‌సెన్(డెన్మార్క్)పై గెలిచాడు. ఇక మహిళల డబుల్ స్టార్ ప్లేయర్స్ త్రీసా జోలీ-గాయత్రీ గోపీచంద్, పురుషుల డబుల్స్ సాత్త్విక్-చిరాగ్ జోడీ తొలిరౌండ్‌లోనే నిష్క్రమించాయి.










