Apr 01,2023 11:53

హైదరాబాద్‌ : ఢిల్లీ వేదికగా గత ఆదివారం ముగిసిన ప్రపంచ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో నిఖత్‌ 50 కిలోల విభాగంలో వరుసగా రెండోసారి బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌గా నిలిచిన తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ శనివారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. శంషాబాద్‌ విమానాశ్రయంలో నిఖత్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమెకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడా శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో క్రీడా శాఖ అధికారులు ఎయిర్‌ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌ పోర్టులో దిగిన వెంటనే ఓపెన్‌ టాప్‌ జీప్‌లో త్రివర్ణ పతాకాలతో ఆమెను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ ఈ. ఆంజనేయ గౌడ్‌, రాష్ట్ర ఒలంపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వేణు గోపాల చారి, రాష్ట్ర బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చాముండేశ్వరి నాథ్‌, రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు, వివిధ క్రీడా అసోసియేషన్‌ ప్రతినిధులు, నిఖత్‌ కుటుంబ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.