Jun 08,2023 22:15

ఆస్ట్రేలియా 469ఆలౌట్‌
సిరాజ్‌కు నాలుగు, శార్దూల్‌, షమీకి రెండేసి వికెట్లు

లండన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యుటిసి ఫైనల్లో భారతజట్టు పోరాడుతోంది. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 469పరుగులకు ఆలౌట్‌ చేసిన టీమిండియా.. రెండోరోజు 25ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 105పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌(15), శుభ్‌మన్‌(13), పుజారా(14), కోహ్లి(14) త్వరగా ఔటై పెవీలియన్‌కు చేరారు. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను ఆల్‌రౌండర్‌ జడేజాాసీనియర్‌ బ్యాటర్‌ అజింక్యా రహానే కలిసి ఆదుకున్నారు. రహానేకు ఓ జీవన దానం లభించడం విశేషం. అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 3వికెట్ల నష్టానికి 327పరుగులతో గురువారం రెండోరోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియాను వికెట్‌ కీపర్‌ క్యారీ(48) ఆదుకున్నాడు. ఓవర్‌ నైట్‌ బ్యాటర్స్‌ స్టీవ్‌ స్మిత్‌(121)ను శార్దూల్‌ ఔట్‌ చేసి తొలి బ్రేక్‌ అందించాడు. ఆ తర్వాత హెడ్‌(163)ను సిరాజ్‌ ఔట్‌ చేశాడు. దీంతో క్రీజ్‌లో నిలదొక్కుకున్న వీరిద్దరూ లంచ్‌లోపే ఔటవ్వడంతో భారత్‌ ఆశలు చిగురించాయి. ఆ తర్వాత క్యారీ(48) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించగా.. గ్రీన్‌(6), స్టార్క్‌(5), కమిన్స్‌(9), లియాన్‌(9)లను భారత బౌలర్లు త్వరగా పెవీలియన్‌కు పంపారు. చివరి వికెట్‌గా కమిన్స్‌ను సిరాజ్‌ ఔట్‌ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 469పరుగుల వద్ద ముగిసింది.
టెస్టుల్లో రహానే 100వ క్యాచ్‌
టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ అజింక్యే రహానే వన్డేల్లో 100వ క్యాచ్‌ను అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యుటిసి ఫైనల్లో పాట్‌ కమిన్స్‌ క్యాచ్‌ అందుకోవడం ద్వారా రహానే ఈ ఫీట్‌ చేరుకున్నాడు. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన బౌలింగ్‌లో పాట్‌ కమిన్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను 0.696 రేట్‌తో అందుకున్నాడు. బౌలింగ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ కమిన్స్‌ను రహానే క్యాచ్‌ అందుకోవడంతో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 469పరుగులకు ఆలౌటైంది. దీంతో కమిన్స్‌ చివరి వికెట్‌గా క్రీజ్‌ను వదిలాడు. రహానే 83టెస్టుల్లో 100క్యాచ్‌లను అందుకున్నాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాబితాలో రాహుల్‌ ద్రావిడ్‌ అందరికంటే ముందంజలో ఉన్నాడు. 1996-2012 మధ్య కాలంలో ద్రావిడ్‌ 163టెస్టుల్లో 209క్యాచ్‌లు పట్టాడు. ఈ క్రమంలో ద్రావిడ్‌ 0.698 క్యాచ్‌ ఫర్‌ ఇన్నింగ్‌తో రహానే కంటే ముందు ఉన్నాడు. ప్రస్తుతం భారత్‌ తరఫున కోహ్లి(109 క్యాచ్‌లు) అందుకొని ముందు ఉండగా.. రహానే రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.
స్కోర్‌బోర్డు...
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి)శ్రీకర్‌ భరత్‌ (బి)శార్దూల్‌ 43, ఖవాజా (సి)శ్రీకర్‌ భరత్‌ (బి)సిరాజ్‌ 0, లబూషేన్‌ (బి)షమీ 26, స్టీవ్‌ స్మిత్‌ (బి)శార్దూల్‌ 121, హెడ్‌ (సి)శ్రీకర్‌ భరత్‌ (బి)సిరాజ్‌ 163, గ్రీన్‌ (సి)శుభ్‌మన్‌ (బి)షమీ 6, అలెక్స్‌ క్యారీ (ఎల్‌బి)జడేజా 48, స్టార్క్‌ (రనౌట్‌) సబ్‌ అక్షర్‌ 5, కమిన్స్‌ (సి)రహానే (బి)సిరాజ్‌ 9, లియాన్‌ (బి)సిరాజ్‌ 8, బోలండ్‌ (నాటౌట్‌) 1, అదనం 38, (121.3ఓవర్లలో ఆలౌట్‌) 469పరుగులు.
వికెట్ల పతనం: 1/2, 2/71, 3/76, 4/361, 5/376, 6/387, 7/402, 8/453, 9/468, 10/469
బౌలింగ్‌: షమీ 29-4-122-2, సిరాజ్‌ 28.3-108-4, ఉమేశ్‌ 23-5-77-0, శార్దూల్‌ 23-4-83-2, జడేజా 18-2-56-1.