Jun 19,2023 21:51
  • ఆసియా ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం

న్యూఢిల్లీ: భారత స్టార్‌ మహిళా ఫెన్సర్‌ సిఎ భవానీ దేవి నయా చరిత్ర నెలకొల్పింది. ఆసియా ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సోమవారం జరిగిన కాంస్య పతకం సాధించి ఈ రికార్డు నెలకొల్పింది. క్వార్టర్‌ఫైనల్లో భవానీ దేవి ప్రపంచ ఛాంపియన్‌ మిసాకి ఎమురాను ఓడించి సెమీస్‌కు చేరి.. సెమీస్‌లో జనాబ్‌ చేతిలో ఓటమిపాలై కాంస్య పతకాన్ని ఖాయం చేసింది. క్వార్టర్‌ఫైనల్లో భవానీ దేవి 15-10పాయింట్ల తేడాతో ప్రపంచ ఛాంపియన్‌కు షాక్‌ ఇచ్చింది. అంతకుముందు మిసాకితో జరిగిన మూడు మ్యాచుల్లోనూ ఓడిన భవానీ.. నేటి మ్యాచ్‌లో ప్రారంభం నుంచే అద్భుత ప్రదర్శను ఆకట్టుకుంది. విజయం సాధించిన అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచంలోని అత్యున్నత క్రీడాకారిణులను ఓడించాలన్నది తన కల అని.. టాప్‌ క్లాస్‌ ప్లేయర్‌ మిసాకిపై విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. అలాగే చరిత్రలో తొలిసారి ఫెన్సింగ్‌ విభాగంలో భారత్‌కు పతకం సాధించినందుకు గర్వంగా ఉన్నట్లు తెలిపింది. గత ఆసియా క్రీడల్లో మిసాకి చేతిలో ప్రి క్వార్టర్స్‌లో ఓడానని, ఈసారి ఓ ప్రణాళిక ప్రకారం ఆమెపై విజయం సాధించానని వెల్లడించింది. ఇక సెమీస్‌లో భవానీ దేవి 14-15పాయింట్ల తేడాతో జనాబ్‌ దయిబేకోవా(ఉబ్జెకిస్తాన్‌) చేతిలో పోరాడి ఓడింది. 14-14పాయింట్లతో సమంగా ఉన్న దశలో రిఫరీ ఎర్లీ స్టార్ట్‌ కోసం భవానీ దేవికి రెడ్‌కార్డ్‌ ఇవ్వగా.. ఆ సమయానికి ఇద్దరు ఎల్లోకార్డులతో ఉన్నారు. వీడియో రెఫరల్‌ను భవానీ దేవి కోరినా.. రిఫరీ దానిని తిరస్కరించారు. 'బ్లెడ్‌ కాంటాక్ట్‌' ఉంటేనే రెఫరల్‌కు అవకాశముందని రెఫరీ పేర్కొనడంతో భవానీ దేవి ఓటమిపాలైంది. దీంతో సెమీస్‌లో ఓడిన భవానీ దేవికి కాంస్య పతకం దక్కింది. భవానీ దేవి చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జనరల్‌ సెక్రటరీ రాజీవ్‌ మెహతా అభినందనలు తెలిపారు.