Jun 10,2023 22:15

లండన్‌:ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యుటిసి) ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. భారత్‌ ముందు 444 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 4వికెట్ల నష్టానికి 123 పరుగులతో శనివారం నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 270పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసింది. 167 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను మిచెల్‌ స్టార్క్‌(41), అలెక్స్‌ క్యారీ(66నాటౌట్‌) ఆదుకున్నారు. వీరిద్దరూ 7వ వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించి టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగారు. మార్నస్‌ లబుషేన్‌ (41)ను ఉమేష్‌ యాదవ్‌ అవుట్‌ చేశాడు. కామెరూన్‌ గ్రీన్‌ (25) అవుటైన తర్వాత క్యారీ జోరు పెంచాడు. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ.. వన్డే తరహాలో పరుగులు చేశాడు. స్టార్క్‌ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ప్యాట్‌ కమిన్స్‌(7) ఎక్కువ సేపు నిలవలేదు. భారీ షాట్‌ ఆడబోయి పెవిలియన్‌ చేరాడు. అతను అవుటవగానే ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయాలని ఆసీస్‌ నిర్ణయించింది. అప్పటికి ఆసీస్‌ స్కోరు 270/8. దీంతో భారత్‌ ముందు 444 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజాకు మూడు, మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. మహమ్మద్‌ సిరాజ్‌కు ఓ వికెట్‌ దక్కింది.
అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి శుభ్‌మన్‌ ఔట్‌..
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(18) బలయ్యాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(22 బ్యాటింగ్‌), శుభ్‌మన్‌ గిల్‌(18) ధాటిగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు. అయితే శుభ్‌మన్‌ గిల్‌ వికెట్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌ బరో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. స్కాట్‌ బోలాండ్‌ వేసిన 8వ ఓవర్‌లో శుభ్‌మన్‌ గిల్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి స్లిప్‌ ఫీల్డర్‌ కామెరూన్‌ గ్రీన్‌ డైవ్‌తో సింగిల్‌ హ్యాండ్‌తో బంతిని అందుకున్నాడు. అయితే బంతిని అందుకునే క్రమంలో నేలకు తాకినట్లు తేలింది. దాంతో ఫీల్డ్‌ అంపైర్‌.. థర్డ్‌ అంపైర్‌ సమీక్ష కోరాడు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించగా.. క్లారిటీ రాలేదు. చివరకు బంతి కింద చేతి వేళ్లు ఉన్నాయని థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. అయితే ఈ క్యాచ్‌ను గ్రీన్‌ రెండేళ్ల సాయంతో పట్టుకున్నాడు. క్యాచ్‌ పట్టుకునే క్రమంలో బంతిని నేలకు తాకినట్లు కనిపించింది. కానీ థర్డ్‌ అంపైర్‌ మాత్రం వేళ్లు కింద ఉన్నాయని ఔటివ్వడం వివాదాస్పదమైంది. దీంతో శుభ్‌మన్‌ గిల్‌ నాటౌట్‌ అంటూ ఆధారాలతో సహా అభిమానులు ట్వీట్‌ చేస్తున్నారు.
గెలిస్తే చరిత్రే..
డబ్ల్యూటిసి ఫైనల్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 444 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఛేదిస్తే ఓవల్‌ పిచ్‌ చరిత్రలో నిలిచిపోనుంది. ఇప్పటి వరకు ఒక్క జట్టు కూడా ఈ పిచ్‌పై 300కు పైగా లక్ష్యాన్ని ఛేదించిన సందర్భాలు లేవు. చిట్టచివరగా 1902లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 263 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్‌ జట్టు ఛేదించింది. ఈ లెక్కన చూసుకుంటే ఆసీస్‌ జట్టు టీమిండియా ముందు ఉంచిన 444 పరుగుల లక్ష్యం చాలా కష్టంగా కనిపిస్తోంది.