Mar 24,2023 11:36
  • 2004 నుంచి రూ.861 పెరిగిన వంట గ్యాస్‌ ధర : పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి పాలనలో ఇంధన ధరలు హద్దేలేకుండా పెరిగిపోయాయి. బిజెపి అధికారంలోకి వచ్చేనాటికి వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.241 ఉండగా అదిప్పుడు ఏకంగా రూ.1103కు పెరిగింది. వంట గ్యాస్‌ ధరతో పాటు పెట్రోలు, డీజిల్‌, కిరోసిన్‌ ధరలు కూడా భారీగానే పెరుగుతూవచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి రామేశ్వర్‌ తేలి గురువారం పార్లమెంటులో వెల్లడించారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2004 ఏప్రిల్‌ 1 నాటికి గ్యాస్‌ ధర రూ.241.60 ఉంటే, 2021 ఫిబ్రవరి 4 నాటికి రూ.719 పెరిగిందని, ప్రస్తుతం (2023 మార్చి 1) రూ.1,103కు చేరిందని తెలిపారు. అలాగే పెట్రోల్‌ లీటర్‌ రూ.33.71 ఉంటే రూ.63.01 పెరిగి రూ.96.72కి ఎగబాకిందన్నారు. కిరోసిన్‌ లీటర్‌ రూ.9.26 ఉండగా ఏకంగా రూ.62.83 పెరిగి రూ.72.09కు చేరిందన్నారు.
 

                                                       గ్యాస్‌ సబ్సిడీ రూ.44,647 కోట్ల తగ్గింపు

వంట గ్యాస్‌ సబ్సిడీ రూ.44,647 కోట్ల తగ్గించినట్లు కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. 2013-14లో గ్యాస్‌ సబ్సిడీ రూ.46,458 కోట్లు ఉంటే, దాన్ని 2021-22 నాటికి రూ.1,811 కోట్లకు తగ్గించినట్లు పేర్కొన్నారు.
 

                                                              ఆందోళనకరంగానే నిరుద్యోగం

దేశంలో యువతలో 12.4 శాతం నిరుద్యోగ రేటు నమోదు అయిందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్‌ ఖర్గే అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2021-22లో 15-29 ఏళ్ల మధ్య యువతి, యువకుల్లో 12.4 శాతం నిరుద్యోగం రేటు నమోదు అయిందని తెలిపారు.
 

                                                     మైనార్టీ బడ్జెట్‌ రూ.2,407 కోట్లు తగ్గింపు

2022-23 బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి రూ.2,407.84 కోట్లు తగ్గించినట్లు కేంద్ర మైనార్టీ మంత్రి స్మతి ఇరానీ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022-23 బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి రూ.5,020.50 కోట్లు అంచనా వేశామని, అందులో రూ.2,612.66 కోట్లకు సవరించినట్లు తెలిపారు. గతేడాది బడ్జెట్‌లో సవరించిన బడ్జెట్‌ రూ.4,346.45 కోట్లు కాగా, ఈ ఏడాదిలో రూ.2,612.66 కోట్లకి తగ్గింది.
 

                                                2026 తరువాతే నియోజకవర్గాల పునర్విభజన

2026 తరువాత జరిగే మొదటి జనాభా లెక్కల ప్రకారమే ఎంపి, ఎమ్మెల్యేల నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరుగుతోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ఎంపి జివిఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నియోజకవర్గాల సరిహద్దుల రీడిజైనింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేదని పేర్కొన్నారు.