Jan 13,2023 21:14

న్యూఢిల్లీ : క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఓలా తాజాగా 200 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రొడక్ట్‌, టెక్నాలజీ విభాగాల్లో పనిచేసే వారిని అధికంగా తొలగించినట్లు తెలుస్తోంది. 2022లో ఓలా క్యాబ్స్‌, ఓలా ఎలక్ట్రిక్‌, ఓలా ఫైనాన్సీయల్‌ సర్వీసు విభాగాల నుంచి 1100 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మరోసారి తొలగింపులు చేపట్టినట్లు ఓలా వెల్లడించింది. కాగా.. ఇంజనీరింగ్‌, డిజైన్‌ విభాగాల్లో కొత్త నియామకాలు ఉంటాయని పేర్కొంది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు పరిహార ప్యాకేజీ అందిస్తామని ఓలా ప్రతినిధి వెల్లడించారు. గడిచిన ఏడాది కాలంలో వ్యయాలు తగ్గించుకునే పనిలో భాగంగా పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయగా.. ఓలా ప్లే, ఓలా కార్స్‌, ఓలా డ్యాష్‌ వంటి సంస్ధలను మూసివేసిన విషయం తెలిసిందే. తాజా తొలగింపులు ఈ వారమే మొదలయ్యాయని తెలుస్తోంది.