Nov 07,2022 20:45
  • విస్తరణకు మరో రూ.75 కోట్లు

హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 10.4 శాతం వృద్థితో రూ.19.4 కోట్ల నికర లాభాలు సాధించినట్లు మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ వెల్లడించింది. ప్యాకేజింగ్‌ రంగంలోని ఈ కంపెనీ టర్నోవర్‌ 14.4 శాతం పెరిగి రూ.182.5 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త యూనిట్లు, ఇప్పటికే ఉన్న ప్లాంట్ల విస్తరణకు ఇప్పటికే రూ.50 కోట్లు ఖర్చు చేశామని.. మరో రూ.75 కోట్లు వ్యయం చేయనున్నట్టు మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ సిఎండి జె.లక్ష్మణ రావు తెలిపారు. ఈ ప్రాజెక్టులు 6-9 నెలల్లో పూర్తి కానున్నాయని వెల్లడించారు. ఒటిసి ఉత్పత్తుల కోసం ఇంజెక్షన్‌ బ్లో మౌల్డింగ్‌ (ఐబిఎం) ప్యాకేజింగ్‌ ప్లాంటులో 2023 జనవరిలో ఉత్పత్తి ప్రారంభం కానుందన్నారు. ఫార్మా ఉత్పత్తుల కోసం ఐబిఎం ఫెసిలిటీలను ఏప్రిల్‌లో నెలకొల్పుతామని అన్నారు. వినియోగదారుల నుంచి డిమాండ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌, వైజాగ్‌, మైసూర్‌, సతారా ప్రాజెక్టుల సామర్థ్యం పెంచామన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ కోసం రూ.30 కోట్లతో హర్యానా ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డామన్‌లో రెండవ ప్లాంటు స్థాపించేందుకు స్థలం సేకరించామని చెప్పారు.