ప్రసవించిన తర్వాత తల్లి శరీరంలోని శక్తి మొత్తం కోల్పోతుంది. ఇది మొదటిసారి తల్లి అయిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రసవానంతరం వచ్చే అలసటను అధిగమించడానికి, శక్తిని పుంజుకోవడానికి తల్లులు తమ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓపిక లేక అలసటతో ఇబ్బంది పడే తల్లులకు ఈ చిట్కాలు ఉపయోగిస్తే సత్వర శక్తిని పొందుతారు. మరి అవేంటో తెలుసుకుందామా..!
విశ్రాంతి: నిద్రలేమి కారణంగా.. తల్లులు త్వరగా అలసిపోతారు. అందుకే ఈ సమయంలో బాలింతలు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. బిడ్డ నిద్రపోతున్నప్పుడు ఇతర పనుల్లో నిమగమైతే విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదు. అందుకే ఎన్ని పనులున్నా పక్కనపెట్టి బిడ్డ నిద్రపోతుంటే తనతో పాటు పడుకోవాలి.
ఆరోగ్యవంతమైన ఆహారం: తల్లులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. అన్నిరకాల పోషకాలు, కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటే తల్లులు సత్వర శక్తిని పొందుతారు. కెఫిన్, చక్కెరను వీలైనంతగా తగ్గించాలి. ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి.
వేడి నీటి స్నానం: ప్రసవం తర్వాత తల్లి కండరాలు బలహీనంగా మారతాయి. వేడి నీటితో స్నానం చేస్తే ఉపశమనంగా అనిపిస్తుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది.
వ్యాయామం: కాసేపు నడవడం అలవాటు చేసుకోవడం మంచిది. అలాగే డెలివరీ తర్వాత వైద్యులు సూచించే చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేస్తుంటే ఒత్తిడి దూరమవుతుంది.