విద్యుత్ డిస్కామ్‌ల ప్రైవేటీకరణపై కేంద్ర విద్యుత్ శాఖ స్టాండర్డ్ బిడ్ డాక్యుమెంట్ ముసాయిదాను సెప్టెంబర్ 22న విడుదల చేసి, అభిప్రాయాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. విద్యుత్ డిస్కామ్‌ల ఎక్విప్‌మెంటునంతటినీ ప్రయివేటు వారికి బదలాయించాలని, నామమాత్రపు రుసుము చెల్లించి ఆ భూములను వాడుకొనే హక్కు ప్రయివేటు వారికి కల్పించాలనీ కేంద్రం పేర్కొంది. అదే సమయంలో ప్రైవేటు కంపెనీలకు డిస్కామ్‌లను అప్పగించే నాటికి ఉన్న అప్పులన్నింటిని తీర్చే బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదే. డిస్కామ్ లాభనష్టాలతో ప్రయివేటువారికి సంబంధం లేకుండా ఇకపై కొత్తగా లావాదేవీలు ప్రారంభిస్తారని కేంద్రం స్పష్టం చేసింది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు, నగదు బదిలీ స్కీం పెట్టినప్పుడే డిస్కామ్‌లను ప్రయివేటుపరం చేయడానికే ఈ ప్రయత్నాలని సిపిఎం, వామపక్షాలు చెప్పిన విషయం ఈ ప్రతిపాదనల ప్రచురణతో నిజమని రుజువైంది. ప్రైవేటీకరణ ప్రక్రియ అంతా ఎనిమిది నెలల్లో (32 వారాలు) పూర్తి చేయాలని, వారాల వారీగా వివిధ దశలకు కేంద్రం గడువులు నిర్దేశించింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను, భారతీయ రైల్వేలను మింగేస్తున్న దేశ, విదేశీ కార్పొరేట్లు ఇకపై విద్యుత్ డిస్కాములనూ స్వాహా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేస్తోంది.
రాయితీలకు మంగళం...
విద్యుత్ కొనుగోలు, ప్రసారం, సరఫరాకు అయ్యే మొత్తం ఖర్చు (కాస్ట్ టు సర్వ్)ను వినియోగదార్ల నుండి వసూలు చేయాలని కేంద్రం ఈ ముసాయిదాలో పేర్కొంది. అంటే గృహ వినియోగదారులకు, ఇంకొన్ని తరగతులవారికి డిస్కాములు ఇప్పుడిస్తున్న క్రాస్ సబ్సిడీ ఇకపై వుండదన్నమాట. గత ఏడాది మన రాష్ట్రంలో కాస్ట్ టు సెర్వ్ యూనిట్‌కు రూ.6.87 కాగా 50 యూనిట్ల లోపు వాడే గృహ వినియోగదారుల నుండి యూనిట్‌కు రూ.1.45 మాత్రమే వసూలు చేసింది. అంటే రూ.5.42 క్రాస్ సబ్సిడీ ఇచ్చింది. ఇకనుండి ప్రైవేటు వారు ఇలాంటివి ఇవ్వరు. అందరూ యూనిట్‌కు రూ.6.87 లేదా అంతకన్న ఎక్కువ చెల్లించాలి. యూనిట్‌కు రూ. 5.42 వరకు అదనపు భారం పడుతుంది. అలాగే వ్యవసాయ పంప్‌సెట్లకు, దోభీ ఘాట్లకు ఉచిత విద్యుత్తు, దళితులు, గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, చేనేత, రజక, క్షౌర వంటి తరగతులకు రాయితీపై విద్యుత్తు ఇవ్వడానికయ్యే ఖర్చును ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తోంది. ఇకపై అవన్నీ నగదు బదిలీ పద్ధతిలో జరగాలని కేంద్రం షరతు విధించింది. ఇందుకోసమే వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లు బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం జిఓ 22 కూడా జారీ చేసి, శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలుకు పూనుకుంది. రైతుల విషయంలోనే అలాంటి చర్యలకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం దళితులు, గిరిజనులు, ఇతర బలహీన వర్గాల వారి విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించకుండా ఉండదు. కాబట్టి ప్రస్తుతం అటు ప్రభుత్వం నుండి, ఇటు డిస్కాం ద్వారా వివిధ రూపాల్లో రాయితీలు పొందుతున్న వారందరూ ప్రైవేటీకరణతో తీవ్రంగా నష్టపోతారు.
అన్నీ ప్రైవేటుకు అనుకూలంగా...
ఈ ముసాయిదా ప్రకారం డిస్కామ్‌ల ఎక్విప్‌మెంటునంతటినీ ప్రయివేటు వారికి వెంటనే బదలాయిస్తారు. నామమాత్రపు రుసుము చెల్లించి డిస్కాముల భూములన్నిటినీ వాడుకొనే హక్కు ప్రయివేటు వారికి కల్పిస్తారు. అంటే బ్రిటీష్ పాలనా కాలం నుండి ప్రజల సంపదగా వృద్ధి చెందిన విద్యుత్ రంగం ప్రయివేటు ఆస్తిగా మారిపోతుంది. అదే సమయంలో ప్రైవేటు కంపెనీలకు డిస్కామ్‌లను అప్పగించే నాటికి ఉన్న అప్పులన్నింటిని తీర్చే బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం పేర్కొంది. డిస్కామ్ లాభనష్టాలతో ప్రయివేటువారికి సంబంధం లేకుండా ఇకపై కొత్తగా లావాదేవీలు (క్లీన్ బ్యాలెన్స్ షీట్) ప్రారంభిస్తారని కేంద్రం స్పష్టం చేసింది. ఇంతవరకు ప్రైవేటీకరించిన ఏ రంగాల్లోనూ లేని విధంగా ఈ షరతును విధించడం పట్ల మార్కెట్ విశ్లేషకులు ఉప్పొంగిపోతున్నారు. 'లాభాల ప్రైవేటీకరణ - నష్టాల జాతీయీకరణ' అంటే ఇదే కదా! డిస్కాములు మునిగిపోవడానికి ఒక ముఖ్య కారణమైన విద్యుత్ కొనుగోలు ఒప్పందా(పిపిఎ)లను కూడా కొత్తగా వచ్చే ప్రైవేటు సంస్థకు కాకుండా ఉమ్మడి బాధ్యతతో నడిచే స్పెషల్ పర్పస్ వెహికల్‌కు అప్పగించడమూ మోసపూరితమే! డిస్కాముల బదలాయింపు (ప్రైవేటీకరణ) ప్రక్రియలను మూడు భాగాలుగా (బదలాయింపునకు ముందు-బదలాయించే సందర్భం- అనంతర నిర్వహణ) విభజించి అందుకు విధివిధానాలు నిర్ణయించడాన్నీ కార్పొరేట్లు స్వాగతిస్తున్నారు. వివిధ దశలను ఎంత వ్యవధిలో ఏ విధంగా అమలు చేయాలో వారాల వారీగా గడువులు విధించి ప్రైవేటీకరణ ప్రక్రియనంతటినీ 32 వారాల్లో పూర్తి చేయాలని నిర్దేశించడాన్ని బట్టి డిస్కాముల అప్పగింతకు కేంద్రం ఎంతలా తహతహలాడుతోందో విదితమవుతోంది.
ఉద్యోగులు, కార్మికులకు అశనిపాతమే....
కేంద్ర ముసాయిదా ప్రకారం ఇప్పటి వరకూ డిస్కాముల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులను ప్రయివేటుకు బదలాయిస్తారు. వారి సర్వీసు నిబంధనలు కూడా మారిపోతాయి. ప్రభుత్వ రంగంలో పని చేసిన కాలానికి సంబంధించిన పెన్షన్, పి.ఎఫ్, గ్రాట్యుటీ తదితర టెర్మినల్ బెనిఫిట్లుగా ఉద్యోగికి చెల్లించవలసిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని, లేదా అందుకు పూచీ పడాలనీ కేంద్రం పేర్కొంది. విధుల్లో కొనసాగేవారికి వర్తించే విధి విధానాలను ప్రైవేటు సంస్థతో చర్చించి నిర్ణయించుకోవాలట! ప్రస్తుతం ప్రభుత్వరంగ ఉద్యోగులు, కార్మికులగా భద్రతతో బతుకుతున్న వారంతా ఇకపై ప్రయివేటువారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందన్నమాట. ఉద్యోగుల కుదింపు తప్పదు. గతంలో ప్రైవేటీకరించిన సంస్థల్లో ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాల్లో ఇంత స్పష్టంగా ఏవీ లేవని మార్కెట్ పండితులు సంబర పడుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల సంగతే అంతంత మాత్రంగా వుంటే ఇక పెద్ద సంఖ్యలో నేడున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తు అగమ్య గోచరమవుతుంది. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు వస్తాయి కాబట్టి మీటర్ రీడర్లు, బిల్ కలెక్టర్లు వంటి వారి ఉపాధి కూడా గల్లంతవుతుంది. అందుకే అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సంఘం ప్రైవేటీకరణ ప్రతిపాదనల్ని తీవ్రంగా ఖండించింది. ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ విద్యుత్ విట్రాన్ నిగమ్ (పియువివిఎన్‌ఎల్) ప్రైవేటీకరించాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోకపోతే సమ్మె చేపడతామని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. మీరట్ లోని పివివిఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు సెప్టెంబర్ 22న నిరసన చేపట్టారు. 25 నుండి అక్టోబర్ 2 వరకు నిరసనోద్యమాలు చేపడతామని డిస్కాం అధికారులు తెలిపారు. డిస్కంలను ప్రైవేటీకరిస్తే పూర్తి స్థాయిలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలకు సమీకృతులవుతున్నారు.
మార్గమేమిటి...?
విద్యుత్ చట్టానికి సవరణలు ప్రతిపాదించడం, రాష్ట్రాలు అదనపు అప్పు తీసుకోవడానికి ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలను సడలించాలంటే వ్యవసాయ పంప్‌సెట్లకు నగదు బదిలీ షరతు విధించడం వంటి చర్యల ద్వారా కేంద్ర ప్రభుత్వం బలవంతంగానైనా విద్యుత్ సంస్కరణల్ని అమలు చేయించాలని చూస్తోంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ కేంద్ర విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేరళ వామపక్ష ప్రభుత్వం ఈ సంస్కరణల్ని తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఆ రాష్ట్రంలో విద్యుత్ బోర్డు ముక్కలు చేయలేదు కూడా! తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు కూడా కేంద్ర షరతులను గుండుగుత్తగా అంగీకరించడం లేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నడక అందుకు భిన్నంగా వుంది. ప్రమాణ స్వీకారం చేసినప్పుడే అక్రమ పిపిఎ లను సమీక్షిస్తామని గట్టిగా చెప్పినా కేంద్ర విద్యుత్ మంత్రి లేఖ, ప్రైవేటు జనరేటర్ల ఒత్తిడితో వెనక్కుపోయినట్టు కనిపిస్తోంది. తీరా ఇప్పటికొచ్చేసరికి పంప్‌సెట్లకు మీటర్లు బిగించడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలిచే దుస్థితి దాపురించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారకపోతే ప్రజల ప్రయోజనాలకు తీవ్ర హాని కలుగుతుంది. రైతులపై భారాలు పడడంతో పాటు...బలహీన వర్గాలకు, తరగతులకు చెందినవారి రాయితీలు హరించుకుపోతాయి. ఉద్యోగులు, కార్మికులకు పెను ప్రమాదం పొంచి వుంది. కేంద్రం పెడుతున్న షరతుల్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలి. అందుకు జనం నుండి ఒత్తిడి పెరగాలి. తెలంగాణ మాదిరిగా ఇక్కడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్న వామపక్షాల డిమాండ్ సబబైనది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కు తగ్గకపోతే విశాల ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావడం తప్ప వేరే మార్గం లేదు.










