Jun 25,2022 21:45

- జగనన్న ఇళ్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం
- 'జనం కోసం సిపిఎం'లో నేతల ఎదుట ప్రజల ఆవేదన
- సమస్యలు పరిష్కరించాలని సచివాలయాల ఎదుట ధర్నాలు
ప్రజాశక్తి-యంత్రాంగం :
'జనం కోసం సిపిఎం'లో సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం కొనసాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు పలు సమస్యలను నేతల దృష్టికి తీసుకొచ్చారు. రహదారుల, డ్రెయినేజీలు అధ్వానంగా ఉన్నాయని, ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంలేదని, తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నామని, ఆస్తి, చెత్త పన్ను, విద్యుత్‌ ఛార్జీలతో అల్లాడుతున్నామని, అర్హులకు పింఛన్లు అందడంలేదని వాపోయారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పలుచోట్ల 'జనం కోసం సిపిఎం' సర్వేలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయాల ఎదుట ప్రజలతో కలిసి నేతలు ధర్నా చేశారు. అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు
సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వడం లేదని, సాగుదారులను బెదిరించి అటవీశాఖ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్‌.పురం మండలం ములకనపల్లి పంచాయతీ పరిధిలోని జల్లివారి గూడెం, ములకనపల్లి, బంగారు గూడెం ప్రజలు నేతల దృష్టికి తీసుకొచ్చారు. గృహాలు, మరుగుదొడ్ల బిల్లులు చెల్లించడం లేదని తెలిపారు. డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగునీరు ఇంటి ముంగిట నిల్వ ఉండిపోతోందని అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలోని తారకరామ కాలనీ వాసులు వాపోయారు.
శుద్ధ వాగుకు రక్షణ గోడ నిర్మించాలి
డ్రెయినేజీ ఏర్పాటు చేసి శుద్ధ వాగుకు రక్షణ గోడ నిర్మించాలని కర్నూలు నగరంలోని శ్రీ రామ్‌నగర్‌ కాలనీ వాసులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్‌ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 23వ వార్డు సచివాలయం ఎదుట నేతలు ధర్నా చేశారు. నంద్యాల జిల్లాలో పలు సచివాలయాల వద్ద ధర్నా చేసి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
రొయ్యల చెరువుల తవ్వకాలను నిలుపుదల చేయాలి
రొయ్యల చెరువులతో పంటలు నష్టపోతున్నామని కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామస్తులు నేతల దృష్టికి తీసుకొచ్చారు. చెరువుల తవ్వకాలను నిలుపుదల చేయించాలని కోరారు. సిసి రోడ్లు, డ్రెయిన్లు లేవని కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం జిఎంసి బాలయోగి కాలనీ వాసులు తెలిపారు. డ్రెయినేజీలో మురుగు తొలగించడంలేదని, దొమలు స్వైరవిహారం చేస్తున్నాయని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పందిరి మహదేవుడు కాలనీ ప్రజలు తెలిపారు.
జగనన్న ఇళ్ల నిర్మాణాలకు బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం
ఉపాధి పనుల బిల్లులు చెల్లించలేదని, జగనన్న ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు, సిమెంటు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం వెంకటాద్రిపల్లి, శీర్పి, నక్కలపల్లి గ్రామాల ప్రజలు నేతలకు విన్నవించారు.
ధరల భారాలతో ఇక్కట్లు
రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, కరెంటు ఛార్జీలు, పన్నుల భారాలతో బతకలేని పరిస్థితి నెలకొందని పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ఇలపకుర్రు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి, చెత్త పన్నులు మరింత భారంగా మారాయని విజయనగరంలోని అబాద్‌ వీధి వాసులు వాపోయారు.
కాట్రగడ రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలి
కాట్రగడ రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలని, వంశధార కాలువ నుంచి సొర్లిగాం కృష్ణసాగరానికి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి సాగు భూములకు నీరందించాలని డిమాండ్‌ చేస్తూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లింగాలవలస సచివాలయం వద్ద నేతలు ధర్నా చేశారు. అనంతరం సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.
విద్యుత్‌ కోతలతో అల్లాడుతున్నాం
వీధిలైట్లు, తాగునీరు, మురుగునీటి సమస్యను ఎదుర్కొంటున్నామని ప్రకాశం జిల్లా ఒంగోలులోని ముండ్లమూరు, వెలిగండ్ల గ్రామస్తులు నేతలకు విన్నవించారు. విద్యుత్‌ కోతలు, పింఛన్లు, రోడ్లు, డ్రెయినేజీలు, తదితర సమస్యలతో అల్లాడుతున్నామని నెల్లూరు వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.