* వార్షికోత్సవ ఆన్‌లైన్ బహిరంగ సభలో వక్తలు
* సంఘ్ పరివార్‌కు చరిత్ర గురించి మాట్లాడే హక్కులేదు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
సంఘ్ పరివార్ శక్తులు వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నాయని, చరిత్ర గురించి మాట్లాడే అర్హత వాటికి లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. నిజాం పాలనను ప్రజలు ఏవిధంగా అయితే ప్రాణాలను లెక్కచేయకుండా కూలదోశారో మోడీ ప్రజా వ్యతిరేక పాలనను ఉద్యమాలతో తిప్పికొట్టాలని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్వర్యాన వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం ఆన్‌లైన్ బహిరంగ సభ గురువారం జరిగింది. ఈ సభలో మల్లు స్వరాజ్యం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భూమి, భుక్తి కోసం వీరతెలంగాణ సాయుధ పోరాటాన్ని చేశామని, దీనికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించి జయప్రదం చేసిందని ఆమె అన్నారు. 10లక్షల ఎకరాలను పేదలకు పంచిపెట్టడం కమ్యూనిస్టుల నాయకత్వంవల్లనే సాధ్యమైందని తెలిపారు. కార్పొరేట్లకు దేశాన్ని దోచిపెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి పోరాటాలతో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. బివి రాఘవులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి బిజెపి, ఆరెస్సెస్, సంఘ్ పరివార్ శక్తులు మతం రంగు పులుముతున్నాయని, దీన్ని అడ్డుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. బిజెపి ప్రభుత్వం రాజ్యాంగంలోని అంశాలను పక్కనబెట్టి, మనుస్మృతిని అమల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళుతోందని తెలిపారు. దీనికోసం కుల, మత ఘర్షణలు పెంచుతూ మరోవైపు ఆర్థిక సంస్కరణలను వేగంగా ముందుకు తీసుకువస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మతం పేరుతో నేడు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మోడీ సర్కారు పూనుకుందన్నారు. భూములను సంపన్నులకు కట్టబెట్టి కార్పొరేట్, కాంట్రాక్టు వ్యవసాయాన్ని తేవాలని చూస్తోందని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితో, ఐక్యపోరాటాల ద్వారా మోడీ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.










