సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు
ప్రజాశక్తి - అమరావతి : కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల దేశంలో ఆహార సమస్య ఏర్పడుతుందని సిపిఎం గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. శనివారం అమరావతి సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్యసమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్‌కు మేలు చేసే ఈ చట్టాల వల్ల భారత వ్యవసాయ రంగం దెబ్బతింటుందని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. డిల్లీలో నిరవధికంగా జరుగుతున్న ఆందోళనలపై నిర్భందకాండ విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటులో ఈ బిల్లును ఉపసంహరించుకునేవిధంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం సంస్థలను ప్రయివేటీకరణ చేసిందని, ఇప్పుడు వ్యవసాయరంగాన్ని కార్పోరేట్‌లకు తాకట్టు పెట్టాలని చూస్తుందన్నారు. తొలుత మహాత్మాగాంధీ వర్థంతి సందర్బంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మొహిద్దీన్‌వలీ, సూరిబాబు, చింతల భాస్కరరావు, గాంధీ, సుబ్రమణ్యం, పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.










