Jan 29,2021 21:26

సిమ్లా :  హిమాచల్‌ ప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు జనవరి 17, 19, 21 తేదీలలో ఎన్నికలు జరిగాయి. ఫలితాలను 22వ తేదీన ప్రకటించారు. సిపిఎం బలపరిచిన అభ్యర్ధులు గతం కన్నా ఎక్కువ చోట్లగెలుపొందారని పార్టీ రాష్ట్ర కమిటీ తెలిపింది. 12మంది జిల్లాపరిషత్‌ సభ్యులుగా, 25 మంది పంచాయితీసమితుల సభ్యులుగా గెలిచారు. 28 మంది పంచాయితీ సర్పంచ్‌లుగాను, 30 మంది ఉప సర్పంచ్‌లుగాను గెలుపొందారు. వీరుగాక 242 మంది వార్డు సభ్యులు సిపిఎం మద్దత్తుతో గెలిచారు. ఇంకా పలువురు సిపిఎం బలపరిచిన అభ్యర్ధులు రెండవ, మూడవ స్థానాల్లో గణనీయమైన వోట్లు సాధించి నిలిచారు.
గత ఎన్నికలలో గెలిచిన స్థానిక ప్రజా ప్రతినిధులు తమ పదవీకాలంలో గ్రామాభివృద్ధికి, ప్రజాసమస్యల పరిష్కారానికి చేసిన కృషి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామసీమల్లో పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలు వ్యవసాయ సమస్యలపై సాగించిన కృషి తోబాటు వైద్యం, విద్య వంటి రంగాలలో చేసిన కృషి పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు. వీటితోబాటు బిజెపి చేసిన వ్యవసాయ చట్టాల గురించి చేసిన ప్రచారం, వివిధ వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దత్తు ధరలను ప్రకటించాలన్న డిమాండ్‌ పై ఆందోళన యువ వోటర్లను ఆకట్టుకుందని పార్టీ నాయకులు తెలిపారు.