Feb 01,2021 07:17

న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, వినాశకర విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి నెలలోని రెండో పక్షం(15 రోజులు)లో దేశవ్యాపితంగా ప్రచారోద్యమం నిర్వహించాలని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ తన అన్ని శాఖలకు పిలుపునిచ్చింది. ఆన్‌లైన్‌ ద్వారా శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు జరిగిన పార్టీ కేంద్రకమిటీ సమావేశం అనంతరం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైంది. గత రెండు నెలలుగా రైతులు సాగిస్తున్న పోరాటానికి సంఘీభావం తెలియజేయడం, ఆరెస్సెస్‌, బిజెపి సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగడుతూనే దేశం నేడు ఎదుర్కొంటున్న ఇతర ముఖ్యమైన సమస్యలపై ప్రచారోద్యమంలో ప్రస్తావించాలని నిర్ణయించింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ క్రమాన్ని, ఆర్థిక పునాదులను కేంద్రం నాశనం చేయడం, మత సమీకరణలకు పదును పెట్టడం, దేశ ఆస్తుల లూటీ, పెద్దయెత్తున ప్రయివేటీకరణ, ధరల పెరుగుదల, కార్మిక చట్టాల రద్దు, నిరుద్యోగం పెరుగుదల వంటి సమస్యలపై ఈ ప్రచారోద్యమంలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలిపింది.
అదేవిధంగా రానున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించడంపై ప్రధానంగా కేంద్రీకరించాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. కేరళలో సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ తిరిగి అధికారంలోకి వచ్చేలా చూడాలని, పశ్చిమబెంగాల్లో వామపక్ష, లౌకిక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయం కోసం కృషిచేయాలని, తమిళనాడులో బిజెపి- అన్నాడిఎంకె కూటమిని ఓడించి, డిఎంకె నేతృత్వంలోని కూటమి విజయం సాధించేలా చూడాలని, అసోం అసెంబ్లీలో పార్టీ ప్రభావాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పార్టీ 23వ అఖిలభారత మహాసభ

సిపిఐ(ఎం) 23 వ మహాసభను వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో బహుశా ఫిబ్రవరి నెలాఖరు కల్లా జరపాలని ధ్యేయంగా పెట్టుకున్నట్లు కేంద్ర కమిటీ తెలిపింది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే జరగాల్సిన ఈ మహాసభ కోవిడ్‌ా19 లాక్‌డౌన్‌, కేరళ, బెంగాల్‌, అస్సాం, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా వేయాలని నిర్ణయించింది. అఖిలభారత మహాసభకు ముందు శాఖల స్థాయిలో మహాసభ ప్రక్రియ అసెంబ్లీ ఎన్నికల అనంతరం అంటే జులై మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపింది.

రానున్న కేంద్ర బడ్జెట్‌
ప్రభుత్వం భారీగా తన వ్యయాలను పెంచితేనే ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం సాధ్యమన్న విషయం ప్రపంచవ్యాప్తంగా పలు సందర్భాల్లో నిరూపితమైందని కేంద్ర కమిటీ గుర్తుచేసింది. ఆర్థిక పునరుద్ధరణ, ప్రజల సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు ప్రతిస్పందించే ఏ ప్రభుత్వమైనా అవసరమైన మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెంచాలని, తద్వారా భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని స్పష్టం చేసింది. అనంతరం ఉద్యోగాలు పొందిన యువకులు తమ వేతనాలను ఖర్చు చేస్తారని, దీని వలన దేశీయ డిమాండ్‌ పెరుగుతుందని, ఇది ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఒక గొప్ప ప్రారంభంగా ఉంటుందని తెలిపింది. దీన్ని ప్రజలు కోరుకుంటున్నారని, అయితే బిజెపి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా దేశ ఆస్తులను లూఠీ చేస్తూ తన కార్పొరేట్‌ సన్నిహితులకు కట్టబెడుతోందని విమర్శించింది.