- రేపు నిరసనలకు న్యాయవాదుల పిలుపు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడిన సీనియర్ న్యాయవాదులు, జర్నలిస్టులు, ఆడిటర్లకు సిఐడి నోటీసులు పంపడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మార్గదర్శి అకౌంటెంట్ అరెస్టుపై వేర్వేరు సంస్థల ఆధ్వర్యాన ఈ నెల రెండోతేదీన నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి పలు సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు హాజరయ్యారు. వారిలో ఛార్టర్డ్ ఎకౌంటెంట్లు నేతి పరమేశ్వరరావు, శ్రీరామ్, జన్నలగడ్డ శ్రీనివాసరావు, న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్, ముప్పాళ్ల సుబ్బారావు, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, జడా శ్రావణ్‌కుమార్, ఎపి జర్నలిస్టు ఫోరం నాయకులు చెవుల కృష్ణాంజనేయులు, ప్రొగ్రెసివ్ ఫోరం నాయకులు పివి మల్లికార్జునరావు, మాజీ అధికారి ఉప్పులేటి దేవీప్రసాద్ తదితరులు ఉన్నారు. దీనిలో ఎపి బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 'వైద్యులు ఎలా వైద్యం చేయాలో, జర్నలిస్టులు ఎలా వార్తలు రాయాలో, సిఎ ఎలా లెక్కలు రాయాలో పోలీసులే చెబుతున్నారు' అనే వ్యాఖ్యానంతోపాటు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలని సిఐడి అదనపు ఎస్‌పి రాజశేఖరరావు సుంకర రాజేంద్రప్రసాద్‌కు నోటీసు ఇచ్చారు. ఆయనతోపాటు ఈ నోటీసులు అందరికీ జారీచేశారు. వారి అభిప్రాయాలు చెప్పడమే నేరంగానూ, విచారణకు అడ్డంకిగానూ భావించి సిఐడి వారికి నోటీసులు జారీచేసింది. విచారణ సమయంలో ఇలాంటి ప్రకటనలు ప్రభావితం చేస్తాయని, ఎందుకు చేశారో చెప్పాలని, ఆధారాలు ఇవ్వాలని సిఐడి అధికారులు నోటీసులో పేర్కొన్నారు. దీనిపై ఎవరికి వారు ప్రతి స్పందించారు. తాను వ్యక్తం చేసిన అభిప్రాయంపై ఎటువంటి ఆధారాలు ఇవ్వాల్సిన అవసరం లేదని సిఐడికి రాజేంద్రప్రసాద్ సమాధానం పంపారు. భావ వ్యక్తీకరణను అడ్డుకోవడం నియంతృత్వమేనని న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ తెలిపారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ నిరసనకు పిలుపునిచ్చింది. దీనిపై ఆలిండియా లాయర్స్ యూనియన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అభిప్రాయం చెబితే దానికి ఆధారాలు ఇవ్వాలని అనడం సరైంది కాదని పేర్కొంది. దీనిపై సోమవారం కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోర్టుల వద్ద న్యాయవాదులు నిరసనలు వ్యక్తం చేయనున్నారు. అనంతరం అన్ని జిల్లాల్లోనూ, హైకోర్టు వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.










