Sep 25,2022 16:17

ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రమేష్ హాస్పిటల్స్ 34వ వార్షికోత్సవం సందర్భంగా రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం మరియు 4వ వార్డ్ కౌన్సిలర్ మారం అమరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ముక్కపాటి నగర్, ఫైర్ స్టేషన్ వద్ద నండ్రు గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఎక్కువ శాతం మంది ప్రజలు యాంత్రిక జీవనం సాగిస్తున్నారని వారంతా తప్పకుండా ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపాలన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్యప్రదేశ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేయడంతో పాటు వైద్యారోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ మాడుగుల నాగరత్నం, కౌన్సిల్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.