కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ...వాతావరణం వేడెక్కుతోంది. అధికార టిఎంసి, బిజెపిలు ఒకటినొకటి విమర్శలు గుప్పించుకుంటున్నాయి. బెంగాల్‌లో కేంద్ర పథకాలేమీ అమలు చేయడం లేదంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కౌంటరిచ్చారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి అర్హులైన 2.5 లక్షల రైతుల పేర్లను కేంద్రానికి పంపితే..ఇప్పటి వరకు స్పందించలేదని మమత అసెంబ్లీలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఒక్క రూపాయి నగదు ప్రోత్సహాకాన్ని కేంద్రం విదల్చలేదని అన్నారు. మొత్తం ఆరు లక్షల మంది నుండి అభ్యర్థనలను రాగా..వాటిని ధ్రువీకరించి..ఈ పథకానికి అర్హులైన 2.5 లక్షల అభ్యర్థుల పేర్లను కేంద్రానికి పంపామని, కానీ ఇప్పుడు వరకు ఎటువంటి నగదు సహాయాన్ని ఇవ్వలేదని పేర్కొన్నారు.










