Sep 18,2020 07:17

అనేక బలమైన జాతులు వున్న మన దేశం ఒకటిగా ఉండాలంటే ఆ జాతుల ప్రయోజనాలు దేశంలో రక్షించబడతాయి, గౌరవించ బడతాయని ఆ ప్రజలకు విశ్వాసం ఉండాలి. అంతే తప్ప ఈ దేశంలో ఉన్నారు గనుక మా పెత్తనం అంగీకరించాలి అనే ధోరణి ఐక్యతను కాపాడలేదు. అందువలనే రాజ్యాంగ నిర్మాతలు ఏ జాతికి ఆ జాతి తనను తాను పరిపాలించుకుని దేశంలో అంతర్భాగంగా ఉండేవిధంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. కేంద్రానికి, రాష్ట్రాలకు వేర్వేరు ప్రభుత్వాల ఏర్పాటుతోపాటు హక్కులను కూడా విభజించారు. ఉమ్మడిగా కొన్ని హక్కులు పెట్టారు. కేంద్రం పెత్తనమే తప్ప రాష్ట్రాలకు హక్కులు, అధికారాలు ఉండకూడదని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం. బిజెపి తన మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాలు అమలు చేస్తున్నది తప్ప రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు. పైగా రాష్ట్రాల అధికారాలను స్వాధీనం చేసుకుంటున్నది.
రాజ్యాంగ నిర్మాతలు విద్యను రాష్ట్రాల జాబితాలో పెట్టారు. ఆ జాతి ప్రజల స్థితి, అవసరాలను బట్టి విద్యా విధానం రూపొందించుకోవాలి. ఇందిరా గాంధీ 1976లో విద్యను ఉమ్మడి జాబితా లోకి మారుస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. ఇపుడు 'నూతన విద్యా విధానం' పేరుతో శిశు విద్య మొదలు ఉన్నత విద్య వరకు సిలబస్‌ ఏం ఉండాలో కేంద్రమే నిర్ణయిస్తోంది. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక దశలో సైతం పాఠాలు ఎవరు చెప్పాలి? వారి అర్హతలు ఏమిటి? వాటి నిర్వహణ ఎవరు చూడాలి? అంతా కేంద్రమే నిర్ణయిస్తుంది. అది చెప్పింది చేయడమే రాష్ట్రాల పని. రాష్ట్రాల హక్కును కేంద్రం చేతుల్లోకి చేర్చారు మోడీ. ఈ అంశాన్ని టిడిపి బలపరుస్తోంది. ఇలా వుండగా, దేశంలో దీనిని ముందుగా అమలు చేస్తున్నది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వమే.
'ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌'ను కేంద్రం సమన్వయం చేసేది. సభ్యులంతా రాష్ట్రాలవారే ఉండేవారు. వారంతా ప్రభుత్వ వైద్య రంగంలో ఆయా రాష్ట్రాల్లో నిష్ణాతులైన డాక్టర్లే. అయితే మోడీ ప్రభుత్వం దానిని 'నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌'గా పేరు మార్చింది. 25 మంది సభ్యులతో కూడిన కౌన్సిల్‌లో 20 మందిని కేంద్రమే నియమిస్తుంది. ఇందులో డాక్టర్లే ఉండనవసరం లేదు. ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికార్లను, ఇతరులను తమకు తాబేదార్లుగా ఉండే ఎవరినైనా సభ్యులుగా నియమించవచ్చు. అన్ని రాష్ట్రాల నుండి అయిదుగురు సభ్యులు ఉంటారు. అంటే రాష్ట్రాలకు రొటేషన్‌ పద్ధతిలో ఐదారేళ్లకొకసారి కమిటీలో సభ్యత్వం లభిస్తుంది. వైద్య విద్యను కూడా కేంద్రం పెత్తనం కిందకు లాగేశారు. దీనికి కూడా చంద్రబాబు, జగన్‌ మోహన్‌ రెడ్డి ఇద్దరూ మౌనంగానే వున్నారు. ఎవరి కార్యకలాపాలైనా అనుమానాస్పదంగా, చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని కేంద్ర నిఘా సంస్థలు భావించినా ఆ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారి అనుమతి తీసుకొని ఆ వ్యక్తులను దర్యాప్తు చేయవచ్చు. అరెస్టు చేయవచ్చు. ఆస్తులు జప్తు చేయవచ్చు. అయితే, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టానికి (యుఏపిఏ) మోడీ ప్రభుత్వం సవరణ చేసేసింది. రాష్ట్రాల అనుమతి లేకుండానే జాతీయ దర్యాప్తు సంస్థ రాష్ట్రాల్లోకి చొరబడి ఎవరినైనా అరెస్టు చేసి తీసుకుపోవచ్చు. దర్యాప్తు చేయవచ్చు. ఆస్తులు జప్తు చేయవచ్చు. దీన్ని టిడిపి, వైసిపి బలపర్చాయి. ఉమ్మడి జాబితాలో వున్న విద్యుత్‌ను క్రమంగా కేంద్రం అధీనంలోకి తీసుకుంటున్నది. మొదట రాష్ట్రాల విద్యుత్‌ బోర్డును రద్దు చేశారు. ఇపుడు ఉచిత విద్యుత్‌ ఇవ్వవద్దంటున్నది మోడీ ప్రభుత్వం. మీటర్లు పెట్టనిదే సర్వీస్‌ కనెక్షన్‌ ఇవ్వొద్దని చట్టం చేస్తోంది. 20 శాతం కంటే సబ్సిడీ ఇవ్వకూడదని మరో షరతు. పంపిణీని కూడా ప్రైవేటుపరం చేసే సవరణతో కేంద్ర విద్యుత్‌ చట్టం చేస్తున్నారు. చట్టమే కాలేదు కానీ ముందుగా మీటర్లు పెట్టేసి అమలుకు జగన్‌ సిద్ధం కాగా...ఆ చట్ట సవరణల ఘనత తనదేనని చంద్రబాబు పక్కతాళం వేస్తున్నారు.
వాహనాలు అమ్ముడైన రాష్ట్రంలో వాటి రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. రాష్ట్రాలే రూట్‌ పర్మిషన్‌ ఇస్తాయి. ఇటువంటి మోటారు వాహన చట్టానికి మోడీ ప్రభుత్వం సవరణ చేసింది. ఇకమీదట వాహనాల రిజిస్ట్రేషన్‌, రూట్‌ పర్మిషన్‌ కూడా కేంద్రమే ఇస్తుంది. వాహనాలపై ఫీజులు, అపరాధ రుసుములు కేంద్రమే నిర్ణయిస్తుంది. కేంద్రం చెప్పినట్లు చేయడమే రాష్ట్రాల పని. దీన్నీ జగన్‌ ప్రభుత్వం వ్యతిరేకించలేదు. అమలు చేస్తోంది. చంద్రబాబు మౌనంగా ఆమోదిస్తున్నారు. వ్యవసాయం ఉమ్మడి జాబితా లోని అంశం. వ్యవసాయ ఉత్పత్తి, రవాణా, నిత్యావసర సరుకుల నిల్వ మీద పరిమితి చట్టం ఎత్తివేత, ధరల నియంత్రణ నుండి ప్రభుత్వం తప్పుకోవడం, మార్కెట్‌ మొత్తాన్ని కార్పొరేట్లకు దఖలుపర్చడాన్ని మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తున్నది. రాష్ట్రాల హక్కుపై దాడి చేస్తున్నది. దీనిని టిడిపి, వైసిపి రెండు పార్టీలూ బలపరుస్తున్నాయి.
రాజ్యాంగం ప్రకారం కో-ఆపరేటివ్‌ బ్యాంకులు రాష్ట్రాల పరిధిలో ఉండాలి. అయితే, 16వ తేదీన పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసేసుకుంది. పార్లమెంటు సభ్యులు సెలెక్ట్‌ కమిటీకి పంపమన్నా...మొండిగా మంద బలంతో ఆమోదింప చేసుకుంది. వైసిపి, టిడిపి రెండు పార్టీలూ బలపర్చాయి.
కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కుల కోసం ఏర్పడ్డ పార్టీ టిడిపి. జ్యోతిబసు తదితరులతో కలిసి రాష్ట్రాల హక్కులకై పోరాడారు ఎన్‌.టి.రామారావు. అటువంటి చరిత్ర కలిగిన టిడిపి నేడు...సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బిజెపి ప్రభుత్వ చర్యలను సమర్థిస్తోంది. కాశ్మీర్‌ 370, 35 ఎ అధికరణాల రద్దు, రాష్ట్ర హోదా రద్దు చేయడమేగాక మూడు ముక్కలు చేసి సర్వనాశనం చేయడాన్ని బలపర్చిన హీనస్థితికి దిగజారింది. జగన్‌ మోహన్‌ రెడ్డి కేంద్రం చెలాయిస్తున్న పెత్తనంపై పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని ప్రజలకు చెప్పారు. తీరా ఇపుడు రాష్ట్ర రాజ్యాంగ హక్కులను హరించేలా బిజెపి షరతులు పెడుతుంటే...సాగిలపడి అమలు చేయడమంటే రాష్ట్రానికి, ప్రజలకు ద్రోహం చేయడమే. పాలకులు ద్రోహులుగా మారినపుడు ప్రజలే పోరాడి హక్కులు కాపాడుకోవాలి.
                                                                                                                            * ఎం. కృష్ణమూర్తి (వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)