- ఆంక్షలతో రెగ్యులరైజేషనా? : మండలిలో పిడిఎఫ్ ప్రశ్న
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ చట్టం-2023 బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీన్ని ఆర్థిక, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వంలోని 177 శాఖల్లో 2014 జూన్ రెండో తేదీనాటికి చేరిన 10,117 మంది రెగ్యులరైజ్ అవ్వనున్నారు. క్రమబద్ధీకరణ వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.311 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి పేర్కొన్నారు. పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన చేరినవారిని మాత్రమే ఈ చట్టం ప్రకారం రెగ్యులరైజ్ చేయనున్నట్లు తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని వివరించారు. అటానమస్ బాడీలో ఉండి పనిచేస్తున్న 14,650 మంది వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌లో చేర్చి రెగ్యులరేజ్ చేశామని తెలిపారు. అలాగే ఆశావర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకూ జీతాలు పెంచామని వివరించారు. మెప్మా సిబ్బంది, హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలు పెంచామని అన్నారు.
- సిఎంకు ధన్యవాదాలు : ఎపిఎన్‌జిఒ
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి అసెంబ్లీలో బిల్లును ఆమోదించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎపిఎన్‌జిఒ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కెవి శివారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాటను జగన్ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు.
అంతకు ముందు కాంట్రాక్టు ఉద్యోల క్రమబద్దీకరణ బిల్లుపై మండలిలో జరిగిన చర్చలో పిడిఎఫ్ ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎటువంటి షరతులు లేకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదన్నారు. పలు ఆంక్షలతో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. 2019కి ముందు పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేయాలన్నారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలన్న నిబంధన పాటించి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు కూడా పెంచాలన్నారు. షేక్ షాబ్జి మాట్లాడుతూ ఐదేళ్ల కాలపరిమితిని పరిగణలోకి తీసుకుని రెగ్యులర్ చేయాలన్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తేదీ 2014 జూన్ 2వ తేదీకి ముందు పనిచేస్తున్న వారందరినీ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రెగ్యులర్ చేసేందుకు కసరత్తు చేసినట్లు చెప్పారు. సంబంధిత ఉద్యోగులు పనిచేస్తున్న పోస్టుల్లో రిజర్వేషన్లు, అవసరమైన విద్యార్హత, వయస్సు, పోస్టు ఆర్ధిక శాఖ అనుమతితో శాంక్షన్ అయి ఉండటం, శాశ్వత ప్రాతిపదికన పోస్టు ఖాళీగా ఉండటం తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని వీటిని ప్రమాణికంగా తీసుకుని జాబితా సిద్ధం చేశామని తెలిపారు.ఈ జాబితా ప్రకారం మొత్తం ఉద్యోగుల్లో 10,117 మంది అర్హులుగా నిర్ధారణ అయ్యారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడంపై ఎమ్మెల్సీలు కల్పలత, చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.










