ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాల విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్ష ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదని, వెంటనే చెల్లించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దాదాపు 20 వేల మంది ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు. సమగ్ర శిక్షకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 40 శాతం చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కస్తూరిభా విద్యాలయాల్లోని సిబ్బందికి వేతనాలు 23 శాతం పెంచుతూ చేసిన నిర్ణయాన్ని అమలు చేయలేదన్నారు. కస్తూరిభా విద్యాలయాల్లో ఐదేళ్లుగా పనిచేస్తున్న పిజిటిలకు కూడా వేతనం రూ.12 వేల నుంచి పెంచాలని కోరారు. వీటిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.










