- అన్ని రంగాల్లోకి చొరబడుతున్న మతతత్వ శక్తులు
- మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : గాంధీ స్ఫూర్తితో మతసామరస్యాన్ని చాటాలని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం కోరారు. గాంధీ జయంతి సందర్భంగా 'వర్తమాన పరిస్థితులు - మత సామరస్యం - ఆవశ్యకత' అనే అంశంపై సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో కర్నూలులోని లలిత కళాసమితిలో సోమవారం సదస్సు నిర్వహించారు. విఠపు బాలసుబ్రమణ్యం ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. మతతత్వ శక్తులు అన్ని రంగాల్లోకి చొరబడుతున్నాయని, విద్వేషాన్ని రెచ్చగొట్టడం, విడగొట్టడం చేస్తున్నాయని విమర్శించారు. చివరికి టిప్పుసుల్తాన్, అశోకుల చరిత్రను కూడా వక్రీకరిస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తున్నారని, అధ్యక్షతన పాలన వచ్చినా ఆశ్చర్యం లేదని తెలిపారు. భారత సంస్కృతి మహాప్రవాహం లాంటిదని, ఆ ప్రవాహాన్ని ముక్కలుగా చేయాలనుకోవడం ఘోరమైన విషయమన్నారు. దుర్మార్గమైన ఆర్థిక విధానాలను కప్పిపుచ్చడానికి మతం చుట్టూ జనాలను తిప్పుతున్నారని విమర్శించారు. నేడు మళ్లీ గాంధీ అవసరం పెరిగిపోయిందన్నారు. దేశం ఒకటిగా ఉండాలని కోరుకున్న గొప్పవ్యక్తి గాంధీ అని కొనియాడారు. బ్రిటిష్ వాళ్లకు లొంగిపోతున్నట్లు సావర్కర్ మూడు ఉత్తరాలు రాశారని, గాంధీ రాయమంటే క్షమాపణ పత్రాలను సావర్కర్ రాశారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పడం దుర్మార్గమన్నారు. సుందరయ్య స్ఫూర్తి కేంద్రం కన్వీనర్ జెఎన్. శేషయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ జి.శంకరశర్మ, రవీంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ జి.పుల్లయ్య, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం కో-కన్వీనర్ ప్రసాద్ శర్మ పాల్గొన్నారు.










