Sep 16,2020 15:54


నరేంద్ర మోడీ ప్రభుత్వ ఫాసిస్టు తరహా పోకడలతో దేశంలో లౌకిక రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పౌర స్వేచ్ఛ ప్రమాదంలో పడ్డాయి. ఈశాన్య ఢిల్లీలో అల్లర్లతో ప్రమేయం ఉన్నదంటూ సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్థికవేత్త జయతి ఘోష్‌, స్వరాజ్‌ అభియాన్‌ నేత దేవేంద్ర యాదవ్‌, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అపూర్వానంద్‌, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌ రాహుల్‌ రాయ్ పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా డైరక్షన్‌లో ఢిల్లీ పోలీసులు తప్పుడు కేసులో ఇరికించేందుకు యత్నించడం రాజ్యాంగం ఈ దేశ పౌరులకు ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛపై బాహాటంగా దాడి చేయడమే. మోడీ ప్రభుత్వం 2014 మే లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫాసిస్టు తమ ఎజెండాను వ్యతిరేకించే వ్యక్తులు, సంస్థలను టార్గెట్‌గా చేసుకుని యథేచ్ఛగా దాడులకు తెగబడుతోంది. అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి, దేశంలో బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలను పణంగా పెడుతున్నది. జమ్మూ కాశ్మీర్‌ విచ్ఛిన్నం, ఆర్టికల్‌ 370 రద్దు, సిఎఎ వంటి రాజ్యాంగ విరుద్ధచర్యలకు పాల్పడింది. వీటిపై నిరసన తెలపడానికి ఆస్కారం లేకుండా ముందస్తుగానే రాజకీయ నాయకులను, ఇతర రంగాల ప్రముఖులను పెద్దయెత్తున అరెస్టు చేసి గృహనిర్బంధంలో ఉంచింది. ఏడాది గడిచినా ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, మాజీ కేంద్ర మంత్రి సైఫుద్దీన్‌ సోజ్‌ లకు విముక్తి లభించలేదు. కార్పొరేట్లకు, విదేశీ కంపెనీలకు దేశ సహజ వనరులను దోచిపెట్టే విధానాలను ప్రశ్నించినా, హిందూత్వ శక్తుల దుష్ట పన్నాగాలను వ్యతిరేకించినా కేంద్రంలో మోడీ ప్రభుత్వం, యు.పి లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం సహించలేకపోతున్నాయి. విశ్వ విద్యాలయాల్లో మేధావులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, పౌర హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, కళాకారులు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. హింసను ప్రేరేపించారనో, దేశ ప్రతిష్టను దెబ్బతీశారనో తప్పుడు కేసులు బనాయించి క్రూరమైన యుఎపిఏ, బ్రిటిష్‌ కాలం నాటి దేశ ద్రోహ చట్టాలను ప్రయోగించి కటకటాల వెనక్కి నెడుతోంది. భీమా కొరెగావ్‌ కేసులో సుధా భరద్వాజ్‌, ఆనంద్‌ తెల్తుంబ్డే, గౌతమ్‌ నవలఖాలను ఈ విధంగానే జైలులో పెట్టింది. సిఎఎ వ్యతిరేక నిరసనలను ఈశాన్య ఢిల్లీ అల్లర్లతో ముడిపెట్టి అరెస్టులు చేస్తున్నది. కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ అధీనం కింద పనిచేసే ఢిల్లీ పోలీసులు ఈ అల్లర్లకు ప్రధాన కారకుల్లో ఒకరైన బిజెపి ఎంపి కపిల్‌ మిశ్రాను వదిలేసి, దీనిపై ప్రశ్నించినవారిని జైలులో పెట్టారు. మోడీ ప్రభుత్వ నిరంకుశ చర్యలు కరోనా లాక్‌డౌన్‌ కాలంలో మరింత ఉధృతమయ్యాయి. పార్లమెంటరీ కమిటీలను పని చేయనీయకుండా చేయడం, రాష్ట్రాల హక్కులపై దాడులు, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం, చమురు రంగంలో ప్రతిష్టాకరమైన బిపిసిఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను విదేశీ కంపెనీలకు అమ్మివేయడం వంటివి ఈ ఆరున్నర మాసాల్లోనే చేపట్టింది.
బిజెపి/ఆరెస్సెస్‌ దాడుల నుంచి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, పౌరుల ప్రజాతంత్ర హక్కులను కాపాడాల్సిన న్యాయవ్యవస్థ ఆ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలం కావడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రజాస్వామ్యానికి మూడు మూల స్థంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ ఇటువంటి కీలక అంశాలల్లో రాజీ పడుతోందన్న విమర్శలు రావడం దురదృష్టకరం. జమ్మూ కాశ్మీర్‌ విచ్ఛిన్నం, ఆర్టికల్‌ 370 సవరణ, రాజకీయ నేతల నిర్బంధం వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లపై సత్వర విచారణ చేపట్టడానికి న్యాయ వ్యవస్థకు తీరిక లేకపోయింది. కానీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గగోరు రిటైర్‌ కావడానికి ముందు అయోధ్య కేసులో రోజువారీ విచారణ చేపట్టి తీర్పు నిచ్చారు. ఆ తీర్పులోని లోటుపాట్లు మాట అలా ఉంచితే కోర్టు ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ. కరోనా కాలంలో వలస కార్మికుల సమస్యపై సర్వోన్నత న్యాయస్థానం మొదట స్పందించేందుకు నిరాకరించింది.
ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభం అని చెప్పుకునే మీడియాలో ఒక సెక్షన్‌ బిజెపి ప్రభుత్వానికి బాకాలుగా మారడం విచారకరం. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుంబిగించిన మీడియా నేడు మోడీ ప్రభుత్వ నిరంకుశ చర్యల విషయంలో రాజీ పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో లౌకిక రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశభక్తియుత ప్రజాతంత్ర శక్తులు, లౌకికవాదులు, మేదావులు, రచయితలు అందరిపై ఉంది. ఇప్పటికే ఈ నిరంకుశ చర్యలకు ప్రతిఘటన వివిధ రూపాల్లో వ్యక్తమవుతోంది. మున్ముందు వీటిని మరింత ఉధృతం చేయాలి. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ పోకడలను సమర్థవంతంగా నిలువరించాలి.