Apr 01,2023 16:55
  • ఆర్.వి.ఎన్. స్టడీ సర్కిల్ సదస్సులో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ

ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమంతో పాటు ఉపాధి కల్పన, అభివృద్ధిలకు ప్రాధాన్యత ఉండాలని ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక యుటిఎఫ్ హోంలో రఘుపతి వేంకటరత్నం నాయుడు (ఆర్.వి.ఎన్.) స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ - 2023 అనే అంశంపై సదస్సు జరిగింది. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కెవివి నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సాబ్జీ ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు. 2,79,279.27 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో నికర ఆదాయం 2 లక్షల 20 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుందన్నారు. కేటాయించిన పద్దులకు కూడా వాస్తవ ఖర్చు పరిశీలిస్తే చాలా తక్కువగా ఉంటుందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా ఉన్నట్లు కనపడుతుందని, మెజారిటీ ప్రజలు కనీస వేతనాలు లేక, పూర్తి స్థాయిలో ఉపాధి దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం ఖచ్చితంగా చూడాలని, ఆ పేరుతో ప్రజలపై వివిధ రూపాల్లో భారాలు పెంచడం సమంజసం కాదన్నారు. మన రాష్ట్రానికి కేంద్ర పాలకులు చాలా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రాష్ట్ర హక్కుల కోసం, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధుల కోసం తగిన పట్టుపట్టడం లేదన్నారు. పైగా కేంద్ర విధానాలను సమర్ధిస్తున్నారని తెలిపారు. విద్యా, వైద్యం, గృహ వసతి రంగాలకు తగిన నిధులు కేటాయించాలన్నారు. అప్పుల చెల్లింపులకే చాలా సొమ్ము ఖర్చు అవుతుందన్నారు.  ఉపాధి కల్పనకు, అభివృద్ధి లక్ష్యాలతో బడ్జెట్ ఉంటే రాష్ట్రం వివిధ సూచికలలో అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు, ఆర్.వి.ఎన్. స్టడీ సర్కిల్ కన్వీనర్ ఐ. ప్రసాదరావు లు మాట్లాడుతూ మేధావులు, విద్యావంతులు బడ్జెట్ ను పరిశీలించి ప్రజల తరపున స్పందించాలన్నారు. ఈ సదస్సు కు ఆర్. జయప్రకాష్ ఆహ్వానము పలుకగా, పలివెల వీరబాబు వందన సమర్పణ చేశారు.