May 11,2023 09:06
  • భూ యజమాని సంతకం లేకుండా సిసిఆర్‌సి కార్డులివ్వాలి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కౌలురైతులు తమ హక్కులను సాధించుకునే వరకు అహింసా పద్ధతుల్లో సత్యాగ్రహ పోరాటాల ద్వారా ఉద్యమించాలని ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక నాయకులు, సంయుక్త కిసాన్‌మోర్చా రైతు ఉద్యమ నాయకులు మేథాపాట్కర్‌ తెలిపారు. పంట సాగు చేస్తున్నట్లు రైతు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇచ్చిన అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలోనే సర్టిఫికెట్‌ ఇస్తే సరిపోతుందన్నారు. అంతేకానీ భూ యజమాని సంతకంతో లింక్‌ పెట్టాల్సిన అవసరం లేదన్నారు. విజయవాడ ఎంబివికెలో కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి రైతు స్వరాజ్యవేదిక ఆధ్వర్యాన పబ్లిక్‌ హియరింగ్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేథాపాట్కర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతు భరోసా పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులిస్తున్నాయని, రైతులకు కావాల్సింది పండించిన పంటకు గిట్టుబాటు ధర మాత్రమేనన్నారు. కౌలు రేట్లు బాగా పెరిగిపోయాయని, రేట్లలో ఏదో ఒకరకమైన నియంత్రణ తీసుకురావాలని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రకృతి వల్ల నష్టపోయిన సమయాల్లో నష్టపరిహారం కౌలు రైతులకు అందాలన్నారు. కార్పొరేట్లకు ఏదైనా చేసేందకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కౌలు రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా లేవని ఆమె విమర్శించారు. దేశ నిర్మాతలు రైతులేనన్నారు. రైతులవి ఆత్మహత్యలు కావని, అవన్నీ వ్యవస్థ చేసే హత్యలుగా పరిగణించాలని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా వీటిపై రుణవిముక్తి చట్టాన్ని, కనీస మద్దతు ధరల చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాలన్నారు. విజరుమాల్యా, నీరవ్‌మోడీ వంటి వారు బ్యాంకులకు రూ.కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్నారని, కష్టం చేసుకుని ఇక్కడ ప్రకృతి నేల మీద ఆధారపడుతున్న వారిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. 2013లో భూ సేకరణ చట్టం తీసుకువచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కోసం ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు తీసుకుందన్నారు. దేశ వ్యాప్తంగా అటవీ భూములు సైతం కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళుతున్నాయన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది కౌలు రైతులున్నారని, పంట సాగుదారుహక్కుల చట్టాన్ని సిఎం వైఎస్‌ జగన్‌ అమలు చేయలన్నారు. త్వరలో కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం సిఎంను కలుస్తామని ఆమె తెలిపారు.
అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మికుల సంఘం జాతీయ కార్యదర్శి పిఎస్‌ అజరుకుమార్‌ మాట్లాడుతూ.. సన్న, చిన్నకారు రైతులకు మేలు జరిగే విధంగా చట్టంలో మార్పులు తీసుకురావాలన్నారు. ప్రభుత్వాలకు రైతుల సంక్షేమం పట్టడం లేదన్నారు. ప్రభుత్వం యజమానిగా ఉండే ఆయా భూములకు సంబంధిత శాఖలో అథీకృత అధికారిగా బాధ్యతలు అప్పజెప్పాలన్నారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వ పరంగా అన్ని ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేట్లకు రుణాలు రద్దు చేస్తున్న ప్రభుత్వాలు సన్న, చిన్నకారు రైతులకు సహకరించడం లేదన్నారు. రైతు స్వరాజ్యవేదిక నాయకులు విస్సా కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 12 ఉమ్మడి జిల్లాల్లో 4,154 మందిని 34 గ్రామ పంచాయతీల్లో కౌలు రైతుల పరిస్థితిపై సర్వే చేసి, సమస్యలపై అధ్యయనం చేశామన్నారు. కౌలు రైతుల్లో కేవలం 8.8 శాతం మందికి మాత్రమే పంట సాగుదారుల హక్కుల కార్డు (సిసిఆర్‌సి)లు లభించాయన్నారు. గతంలో 18.6 శాతం మందికి ఎల్‌ఇసి కార్డులు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతుసంఘం మాజీ అధ్యక్షులు వై కేశవరావు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.