
జాతీయోద్యమంలో బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా పోరాడిన, మైనారిటీల అభ్యున్నతికై అహర్నిశలు కృషి చేసిన ప్రముఖ మేధావి అబుల్ కలాం ఆజాద్. స్వతంత్ర భారతావనికి ప్రథమ విద్యా మంత్రిగా సార్వత్రిక విద్యా వ్యాప్తికి సైతం ఆయన ఎంతగానో పాటు పడ్డారు. మౌలానా జన్మదినమైన నవంబరు 11ను మైనారిటీల దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. నవంబరు 11న దేశం లోని వివిధ ప్రాంతాల్లో మైనారిటీల సభలు జరిపి ముస్లిం ప్రజల సంక్షేమం గురించి మొసలి కన్నీళ్లు కార్చటం అధికార పార్టీలకు ఒక ఆనవాయితీగా మారింది. ఉపన్యాసాలతో మైనారిటీల సంక్షేమాన్ని ముగించటం ద్వారా 'మైనారిటీ డే' దేశంలో ఒక క్రతువుగా మారింది. ప్రస్తుత బిజెపి పాలనలో మైనారిటీల సంక్షేమం అన్న పదానికి కూడా విలువ లేకుండా పోయింది. దళితులు, గిరిజనులు, అల్ప సంఖ్యాక వర్గాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమం బిజెపి ఎజెండాలో లేవు. అగ్ర వర్ణాల ఆధిపత్యం తోనే సమాజం నడవాలని బిజెపి సైద్ధాంతికంగా నమ్ముతున్నది. మను వాదాన్ని, మను స్మృతిని మనసారా నమ్ముతున్న సంఘపరివార్ పాలనలో అణచివేతకు గురవుతున్న అట్టడుగు తరగతుల ప్రజల సంక్షేమాన్ని వీరు పట్టించుకోరనేది ఆచరణలో కనబడుతున్నది. బిజెపి పాలనలో మైనారిటీల సంక్షేమాన్ని వెతకడం అంటే ఎండమావుల్లో నీటి కోసం వెతకటమే.
స్వాతంత్య్రానంతరం ముస్లిం మైనారిటీల ఆర్థిక, సామాజిక అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యంపై అనేకమార్లు సర్వేలు జరిగాయి. గతంలో గోపాల్‌సింగ్ కమిషన్, ఇటీవల రాజేంద్ర సచార్ అధ్యక్షతన ఏర్పడిన సచార్ కమిటీ, జస్టిస్ రంగనాథ్ మిశ్రా అధ్యక్షతన పని చేసిన మైనారిటీ కమిషన్లు మైనారిటీల సమస్యలపై, విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలు, వ్యాపారం తదితర రంగాలపై లోతైన అధ్యయనం చేశాయి. దేశం లోని ముస్లిం ప్రజలు విద్య, ఉపాధి రంగాల్లో దేశంలోని ఇతర ప్రజలతో పోల్చితే చాలా వెనకబడి వున్నారని, ఉన్నత విద్యలో దళితులు, గిరిజనుల కంటే కూడా అధ్వాన్నమైన స్థితిలో ఈ తరగతి ప్రజలు వున్నారని సచార్ కమిటీ నివేదిక వెల్లడించింది. అంతేగాక, విద్యలో ముస్లిం మహిళలు దేశంలోనే అందరికంటే వెనుకబడి వున్నారని, వ్యాపార రంగంలో ఈ తరగతి ప్రజలకు జాతీయ బ్యాంకులు చేస్తున్న సహాయం నామమాత్రంగా వుందని కూడా పేర్కొంది. ఈ పరిస్థితి మారనట్లయితే భవిష్యత్తులో ముస్లిం మైనారిటీలు దేశ ప్రధాన స్రవంతి నుండి వేరుపడతారని కూడా హెచ్చరించింది. వారి సంక్షేమానికై ప్రత్యేక నిధులు విద్య, ఉపాధి రంగాల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని తన నివేదికలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి అధికారికంగా సేకరించిన గణాంక వివరాల ఆధారంగా సచార్ కమిటీ ఈ నిర్ణయానికి వచ్చింది. పై ప్రతిపాదనతో పాటుగా దేశంలోని జమ్ము-కాశ్మీర్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ముస్లిం మైనారిటీలకు అన్ని అభివృద్ధి పథకాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జమ్ము-కాశ్మీర్‌లో మాత్రం హిందూ ప్రజలకు ఆ 10 శాతాన్ని రిజర్వు చేయాలని రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది.
సచార్ కమిటీ నివేదికపై చర్చ సందర్భంగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ముస్లిం ప్రజలకు ఇంత కాలం జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని ఇప్పటి నుండి అభివృద్ధి ఫలాలలో మొదటి వాటాను ముస్లిం ప్రజలకు అందిస్తామని వాగ్దానం చేశారు. కాని వారు అధికారంలో కొనసాగినంత కాలం ఆ మాటను మరచిపోయారు. మొదటి ఫలాలు కాదు గదా అభివృద్ధి లోని చివరి ఫలాలు కూడా మైనారిటీ ప్రజలకు దక్కలేదు. ప్రత్యేకించి బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం ప్రజల సంక్షేమం కాదు! వారి జీవితాలకే ప్రమాదం వచ్చింది. గో రక్షణ దళాల దాడులు, ముమ్మారు తలాఖ్ పేరిట జైలు శిక్షలు వేయటం, లవ్ జిహాద్ పేరిట విద్వేషాన్ని రెచ్చగొట్టటం, ఏకపక్షంగా జమ్ము-కాశ్మీర్‌ను విడగొట్టడం, ఆ ప్రజలకిచ్చిన హామీ ఆర్టికల్ 370 రద్దు చేయటం, వారి ఆస్తులు కాజేయటానికి 35 (ఎ)ను రద్దు చేయటం, కరోనాను కూడా మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా కేంద్ర ప్రభుత్వం-అనేక రాష్ట్రాల్లోని బిజెపి నాయకులు వ్యవహరించటం ఈ దేశంలో మైనారిటీలకు తీవ్రమైన అభద్రత వాతావరణాన్ని సృష్టించాయి. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని ఇచ్చేలా చట్టాన్ని సవరించటమేకాక ముస్లింలకు పౌరసత్వాన్ని ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించటమంటే రాజ్యాంగ మౌలిక విలువలను తుంగలో తొక్కటమే. దేశంలోని లౌకిక శక్తుల మద్దతును కూడగట్టి మైనారిటీ ప్రజల మౌలిక హక్కులకై పోరాడటం దేశంలో ప్రధాన కర్తవ్యంగా ముందుకొచ్చింది.
రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తన హయాంలో ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ముస్లిం ప్రజల విద్యాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడింది. గతంలో ఎప్పుడు లేనంత మంది డాక్టర్లు, ఇంజినీర్లు ముస్లిం ప్రజలలో కనబడుతున్నారంటే ఈ రిజర్వేషన్లే ప్రధాన కారణం. అందుకే 2014 నుంచి ముస్లిం మైనారిటీలు ఆయన పట్ల కృతజ్ఞతా భావంతో ఆయన కుమారుడు స్థాపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఏకపక్షంగా ఓట్లు వేస్తున్నారు. తండ్రి అడుగు జాడల్లో మరిన్ని సానుకూల చర్యల ద్వారా తమ అభివృద్ధికి పాటుపడతారని ఈ ప్రభుత్వంపై గంపెడాశతో వున్న ముస్లిం ప్రజలకు ఈ పద్దెనిమిది మాసాల పాలన తీవ్రమైన నిరాశను కల్గిస్తున్నది. గత రెండు బడ్జెట్లలో మైనారిటీల సంక్షేమానికి నిధుల కేటాయింపుల్లో ఎలాంటి పురోగతి లేదు. కనీసం ఆమోదించిన నిధులను విడుదల చేస్తే కొంతలో కొంతైనా మైనారిటీ యువతీ యువకులకు మేలు జరిగేది. అయితే బడ్జెట్‌ను విడుదల చేసినట్లు చూపిస్తూ ఆ నిధులను 'అమ్మ ఒడి, విద్యా కానుక, చేయూత, ఆసరా' లాంటి పథకాలకు నిధులు సమకూర్చటానికి దారి మళ్లిస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పద్దెనిమిది మాసాల పాలనలో మైనారిటీ ప్రజలకు చేసిన ప్రత్యేకమైన కార్యక్రమం ఒక్కటి కూడా లేదు. పైగా ముస్లింలు, క్రైస్తవులు, తదితర మైనారిటీలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ఓటు వేసి అత్యధిక సీట్లలో గెలిపించారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రతి అంశంలో బిజెపికి మద్దతుగా ఓటు వేయటం, ప్రత్యేకించి పౌరసత్వ చట్ట సవరణ అంశంలో బిజెపి ని బలపరచటం ఈ తరగతుల ప్రజలు జీర్ణం చేసుకోలేకపోతున్నారు.
సచార్ కమిటీ కాలం (2005)తో పోల్చుకుంటే దేశంలో, రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధి మరింత దిగజారింది. వారి భాష, సంస్కృతులకు రక్షణ లేకుండా పోతున్నది. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల దురాక్రమణ యథేచ్ఛగా సాగుతున్నది. వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి, దానికి ఎండోమెంట్ శాఖ మాదిరిగా అధికారాలనిచ్చి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కృషి చేయవలసిన ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల పట్ల ఉదాసీన భావంతో వ్యవహరిస్తున్నది. మైనారిటీ ఫైనాన్సు కార్పొరేషన్, ఉర్దూ అకాడమీలకు వేతనాలకు తప్ప నిధులు ఇవ్వనందున అవి కునారిల్లిపోతున్నాయి. ముస్లిం విద్యార్థులు విదేశాల్లో చదువుకోవటానికి గత కొన్ని సంవత్సరాలుగా ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం ఆపివేయటం దురదృష్టకరం. షాదీ ముబారక్, రంజాన్ తోఫా లాంటి కార్యక్రమాలు నిలిచిపోయాయి. మాటలలో ముస్లింల సంక్షేమం తప్ప ఆచరణలో వారి అభివృద్ధికి ఏ కార్యక్రమం అమలు జరగని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం దాడులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం రెండూ కలిసి ముస్లిం ప్రజల అభ్యున్నతికి శాపాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో ముస్లిం ప్రజలను సంఘటితం చేసి వారి మౌలిక హక్కులకై, అభివృద్ధిలో వారి జనాభాకు తగిన నిధుల కోసం...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా ఒత్తిడి పెంచాల్సిన అవసరం నేడు ఎంతైనా వుంది. లౌకిక పార్టీలు, సంఘాలు ముస్లిం మైనారిటీలకు అండగా వుంటూ ఉద్యమ రూపంలో వారిని ముందుకు నడిపించాలి. మైనారిటీలను భాగస్వాములను చేసి లౌకిక విలువలను కాపాడేందుకు, రాజ్యాంగ మౌలిక సూత్రాల పరిరక్షణకు దేశంలో సాగే విశాల ఉద్యమంలో...మైనారిటీల హక్కులకై సాగే ఈ ఆందోళన కూడా ఒక భాగమేనని గ్రహించాలి. మైనారిటీల ఐక్య ఉద్యమాలే మైనారిటీ సంక్షేమానికి పునాది అవుతాయి. 'మైనారిటీ డే' సందర్భంగా నేడు ఈ కర్తవ్య సాధనకు నడుం బిగించాలి.
(వ్యాసకర్త సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)










