వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తామని డప్పు కొట్టుకుంటూ ఆకాశానికి నిచ్చెనలేసే రాష్ట్ర కమలనాథుల ముందు సవా లక్ష సవాళ్లు, ప్రజలకు జవాబు చెప్పుకోవలసిన అంశాలు బోలెడన్ని వున్నాయి. వీటి నుండి తప్పించుకొనేందుకే గుళ్లు గోపురాలపై పడ్డారు.
ఆనాడు రాజ్యసభలో ప్రత్యేక హోదా ప్రతిపాదించినది బిజెపి నేతలే! దాన్ని భూస్థాపితం చేసింది బిజెపికి చెందిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి బిజెపి సహకరించక పోతే రాష్ట్ర విభజనే జరిగేదే కాదు. ఈ మహా పాపంలో బిజెపి కి భాగస్వామ్యముంది.
అమరావతి రాజధానికి పునాది రాయి వేసింది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. తుదకు నైతిక బాధ్యత కూడా గాలికి వదలి పెట్టి మూడు రాజధానుల ముచ్చటను బలపర్చుతున్నదీ బిజెపి.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా పోలవరం అవతరించింది. అన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం తీసుకు రావాలి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాలి. ఇప్పుడు ఏమైంది? నిధులకు ఎక్కడికక్కడికి కోతలు పెడుతున్నారు. కేంద్ర జల శక్తి శాఖకు ఆర్థిక శాఖకు సమన్వయం లేదు. ఇదే జరిగితే పోలవరం ప్రాజెక్టు వచ్చే పదేళ్లకూ పూర్తి కాదు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. నోటి మాట కాదు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 46(3) ప్రకారం అమలు జరగాలి. 24 వేల కోట్ల రూపాయలకు ప్రాజెక్టు రిపోర్టు పంపితే మూడు సంవత్సరాలు కలిపి రెండు వేల కోట్లు ఇచ్చి ఎగ్గొట్టారు. మరీ సిగ్గు విడిచి ఎన్నికల ముందు 'రాయలసీమ డిక్లరేషన్' అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు! నేడు ఏమైంది? వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీతో పాటు కడపలో ఉక్కు కర్మాగారం గాలికి వదలి పెట్టారు.
కేంద్ర ప్రభుత్వ నిధుల వాటాతో పాటు ప్రజల డిపాజిట్లతో కలిపి గత ప్రభుత్వం ఎమినిది లక్షల గృహాలను టిట్కో ఆధ్వర్యంలో నిర్మించింది. కాని వైసిపి రాష్ట్ర ప్రభుత్వం ఏణ్ణర్థంగా పెండింగ్‌లో పెట్టింది. లక్షలాది రూపాయలు చెల్లించిన లబ్ధిదారులు లబోదిబో మంటుంటే వామపక్షాలు ఉద్యమం చేపట్టాయి. కాని కేంద్రం ప్రభుత్వ నిధుల వాటా వున్న ఈ దుర్మార్గం గురించి బిజెపి నేతలు నోరెత్తలేదు! జగనన్న విద్యా దీవెనలో వున్న కేంద్రం నిధులు బిజెపి నేతలకు గుర్తుకొచ్చింది గాని...లక్షలాది మంది లబ్ధిదారుల గోడుతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు వున్నా బిజెపి నేతలకు గుర్తు రాలేదు. రాష్ట్ర బిజెపి నేతలు ఈ అంశాలపై ఎందుకు నోరు విప్పరు?
ప్రజల నిత్య జీవితానికి చెందిన సమస్యలతో పాటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదలి పెట్టి గుళ్లు గోపురాలపై పడ్డారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు, డిమాండ్లు ఎలాగూ నెరవేర్చలేరు కాబట్టి హిందూ సెంటిమెంట్ పై రాజకీయం చేయదలచి తుదకు చేతులు కాల్చుకున్నారు. రాష్ట్ర మంత్రి ఒకరు పరువు తీస్తే కన్నంలో తేలు కుట్టిన.... చందంగా మిన్నకుండి పోయారు. కమలనాథులు రాష్ట్ర ప్రజలకు చేసినవన్నీ ద్రోహాలే.
వైసిపి ప్రభుత్వాన్ని ఒక్క దానినే విమర్శించితే టిడిపి ముద్ర పడుతుందనే భయంతో కాబోలు ఎప్పుడో టిడిపి అమలు చేసిన విధానాలను జత పర్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అభాసు పాలౌతున్నారు. మరోవైపు మూడు రాజధానుల ప్రతిపాదన కేంద్రంతో సంబంధం గల అంశాలు వచ్చినపుడు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని గాని బిజెపిని గాని పల్లెత్తు మాట అనడం లేదు. కేవలం వైసిపి ప్రభుత్వాన్ని మాత్రం విమర్శించి నవ్వుల పాలవుతున్నారు. రాజధానిపై కేంద్రం ఈ రకమైన అఫిడవిట్ వేయక పోతే పరిస్థితి ఇలా వుండేది కాదు కదా. అదే సమయంలో జాతీయ స్థాయిలో బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను వైసిపి తో కలసి టిడిపి యుగళ గీతం పాడుతున్నది. బిజెపి కబంధ హస్తాల నుండి బయట పడితే తప్ప రాష్ట్రంలో టిడిపికి భవిష్యత్తు లేదనే అంశం ఏణ్ణర్థం తర్వాత కూడా కారణాలు ఏవైనా చంద్రబాబు నాయుడు గ్రహించలేక పోతున్నారు.
అదే సమయంలో బిజెపి నేతల ఆరోపణలకు ఒక్క మంత్రి తప్ప మిగిలిన వైసిపి నేతలు మంత్రులు నోరు విప్పడం లేదు. సమయం సందర్భం చూసుకొని టిడిపిపై మాత్రమే విమర్శలు చేస్తున్నారు. మంత్రి లాగా నోరు జారితే కేంద్రం లోని బిజెపి నేతలకు కోపం వస్తుందని జాగ్రత్త పడుతున్నారు. తమాషా ఏమంటే రాష్ట్రంలో వైసిపి, టిడిపి దెబ్బలాడుకుంటున్నా...కేంద్ర ప్రభుత్వం బిజెపి విధానాలు వచ్చే సరికి నీవు ముందా నేను ముందా అని ఇద్దరూ ఎగబడి బలపరుస్తున్నారు. ఇదిలా ఉండగా వికృత క్రీడగా తయారైన సోషల్ మీడియా వెబ్‌సైట్ లో అధికార ప్రతిపక్షాలు రెండూ ఎన్‌డిఎ లో చేరే అంశాలు కథలు కథలుగా హోరెత్తుతున్నాయి.
గతంలో చంద్రబాబు నాయుడు బిజెపితో నెయ్యమొంది తుదకు చేతులు కాల్చుకున్న అనుభవం కళ్ల ముందు వున్నా... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవసరాలు ఏవైనా కావచ్చు ఎన్డీఏ కు మద్దతు ఇస్తే ఆత్మ హననమే అవుతుంది. ప్రత్యేక హోదాతో పాటు తాజాగా పోలవరం ప్రాజెక్టు అంచనాలకు పెట్టిన కోతల తర్వాత ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడడమే అవుతుంది.
తనకు 25 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఇస్తే ప్రత్యేక హోదా తీసుకు వస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి బిజెపి కి మెజారిటీ వచ్చిందని చెప్పి చేతులెత్తేస్తే ప్రజలు మన్నించే స్థితిలో లేరు. రాష్ట్ర విభజన చట్టం కూడా అమలు చేయని కమలనాథులను ప్రశ్నించలేని స్థితిలో వుండిపోవడం క్షంతవ్యం కాదు.
గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీ ఆమోదిస్తూ ప్రత్యేక హోదా సంజీవనా అని ప్రజలకు ఎదురు ప్రశ్నలు వేసిన రోజులున్నాయి. అప్పుడు ప్రజలెలా తీవ్రంగా ప్రతిస్పందించారో చూశాం. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలను అమాయకులనుకొంటే పొరబడిన వారవుతారు. రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎదిరించి కేంద్రంతో పోరుకు దిగకపోతే, నవ రత్నాలే కాపాడుతాయనుకుంటే ముఖ్యమంత్రి పప్పులో కాలేసినట్లే. వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ముఖ్యమంత్రికి అగ్ని పరీక్ష కానున్నది. 2016లో ప్రత్యేక ప్యాకేజీ అమలు లోకి వచ్చినపుడు చంద్రబాబు నాయుడు కేంద్రం షరతులకు తలొగ్గినందున ఈ పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి చెప్పి ప్రజలను మెప్పించ లేరు. ప్రత్యేక హోదా సాధనకు అడ్డుగా బిజెపి కి పూర్తి మెజారిటీ రావడం, పోలవరం నిధుల కోతకు చంద్రబాబు నాయుడు చేసుకున్న ఒప్పందం లాంటి సాకులు చెబితే ప్రజలు సంతృప్తి చెందరు.
వి. శంకరయ్య
(వ్యాసకర్త విశ్రాంత పాత్రికేయులు, సెల్: 9848394013 )










