ప్రజాశక్తి-విజయనగరం : ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యంగా రాష్ట్రంలో వైద్య రంగంలో భారీ సంస్కరణలు తీసుకొచ్చామని, దాని ఫలితంగానే అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య విద్య సులభంగా పేద విద్యార్థులకు చేరువవుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. విజయనగరంలో 70 ఎకరాల్లో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న వైద్య కళాశాల నిర్మాణ పనులను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి ఆమె శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తొలి విడతలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలలను అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. విజయనగరం మెడికల్ కాలేజీతోపాటు మిగిలిన నాలుగు కళాశాలలను విజయనగరం వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారని వెల్లడించారు. ఈ ఐదు కళాశాలల్లో 750 సీట్లను భర్తీ చేస్తామని తెలిపారు. జీరో వేకెన్సీ పాలసీలో భాగంగా వైద్య రంగంలో 50 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. ఆరోగ్యశ్రీలో 3,257 రకాల రోగాలకు సేవలందిస్తున్నామని, వైఎస్‌ఆర్ క్లీనిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చామని, రూ.16 వేల కోట్లతో నాడు-నేడు పనులు చేపట్టామని వెల్లడించారు. మంత్రి బొత్స మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. వైద్య కళాశాల ప్రారంభోత్సవంతో పాటు, గిరిజన యూనివర్సిటీ పనులకు శంకుస్థాపన చేయనున్నామని చెప్పారు.










