లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న కల్లు గీత వృత్తి ఈ రోజు పాలకుల విధానాల వల్ల ఆదరణ కరువై కష్టాల ఊబిలో చిక్కుకుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం బుద్ధి పూర్వకంగానే కల్లుగీత వృత్తిని సర్వనాశనం చేసింది. వైసిపి ప్రభుత్వం వచ్చాకయినా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, పాదయాత్ర సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హమీలు, చేసిన వాగ్దానాలు అమలు చేస్తారని, తమ బతుకులు మారతాయని ఎంతో ఆశగా ఎదురు చూసిన గీత కార్మికులకు నిరాశ కల్గింది. వైసిపి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడచినా కల్లు గీత కుటుంబాల గురించి ఆలోచించకపోవడం చాలా అన్యాయం. లాక్‌డౌన్ కాలంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 40 రోజులు స్వచ్ఛందంగా కల్లుగీత కార్మికులు తాడిచెట్లు గీయడం మానేశారు. తాడిచెట్లను దొంగచాటుగా గీస్తారని భావించిన ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వారు కల్లుగీత కార్మికుల మోకులు స్టేషన్లకు పట్టుకుపోయారు. మరికొన్ని చోట్ల తాడిచెట్లకున్న కల్లు కుండలను రాళ్ళతో బద్దలు కొట్టారు. అంతటితో ఆగక...గీత కార్మికులపై అక్రమ కేసులు కూడా పెట్టారు. కష్టాల్లో వున్న కల్లుగీత కుటుంబాలను, ఈ వృత్తి మీద ఆధారపడిన లక్షలాది మందిని, అనుబంధ వృత్తులైన కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వృత్తిదారుల కష్టాలను వైసిపి ప్రభుత్వం పరిష్కరించి ఆదుకోవాలి. నవరత్నాలు లేదా జగనన్న తోడు, వైఎస్‌ఆర్ చేయూత లాంటి సంక్షేమ పథకాలను కల్లుగీత కార్మికులకు కూడా వర్తింపజేయాలి. కల్లుగీత వృత్తిని, ఉపాధిని కాపాడే విధంగా కల్లు పాలసీ మార్చాలి. కల్లుగీత కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి కొనసాగించాలి. వృత్తిలో ప్రమాదవశాత్తూ చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, శాశ్వతంగా వికలాంగులైన వారికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి. వృత్తి చేస్తున్న వారికి వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కల్లు అమ్మే మహిళలకు, వికలాంగులైన గీత కార్మికులకు పింఛను ఇవ్వాలి. గీత వృత్తిలో మార్పులు తీసువచ్చి...నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలి.
రేపు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాల సందర్భంగా
- జుత్తిగ నరసింహ మూర్తి,
ఎ.పి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు,
సెల్ : 9490098047.










