- కలెక్టరేట్ వద్ద కల్లుగీత కార్మికుల ధర్నా
ప్రజాశక్తి - అనకాపల్లి : అక్టోబర్ 31 నాటికి నూతన ఎక్సైజ్ పాలసీ అమలు చేయాలని, కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5 వేల కోట్లు కేటాయించాలని, గీత కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనకాపల్లి కలెక్టరేట్ వద్ద కార్మికులు సోమవారం ధర్నా చేపట్టారు. మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి అడ్డుకున్నారు. ధర్నానుద్దేశించి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర దేవుడు మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ - కొబ్బరి ఉత్పత్తులను నెలకొల్పాలని, బెల్లం చక్కెర సిరప్, జామ్ చాక్లెట్స్, పామ్ వైన్ వంటి ఉప ఉత్పత్తులు తయారుచేయడం, కల్లును నిల్వ ఉంచే బాట్లింగ్ పద్ధతి, స్టార్ హోటల్స్‌లో అమ్మేందుకు అనుమతులు, కల్లుకు బ్రాండ్లు కేటాయించడం ద్వారా ఈ వృత్తిని పరిశ్రమగా గుర్తించాలని కోరారు. కల్లుగీత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, ప్రమాదంలో చనిపోయిన, శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ.10 లక్షల నష్టపరిహారం, ఐదువేల రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో ఆయా జిల్లాల పేరుపై గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఎపి చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ గంటా శ్రీరామ్ మాట్లాడుతూ.. తాటి, ఈత చెట్లను నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ రవి పఠాన్ శెట్టికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నూక అప్పారావు, తుట్టా ఈశ్వరరావు, సమ్మంగి రాములు, రాయి ఆనంద్ పాల్గొన్నారు.










