న్యూఢిల్లీ : బక్రీద్ (ఈద్-అల్-అజాహ్ ) సందర్భంగా గురువారం స్టాక్ మార్కెట్లను మూసివేశారు. శుక్రవారం యథావిథిగా ట్రేడింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. స్టాక్ ఎక్సేంజీల వార్షిక సెలవుల జాబితాలో బక్రీద్ సెలవుగా బుధవారం ఉంది. అయితే సర్కులర్ల ద్వారా గురువారానికి మార్చినట్లు పేర్కొన్నారు. బక్రీద్ సెలవు మార్పుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వ సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా మంగళవారం, స్టాక్ మార్కెట్, బాంబే స్టాక్ ఎక్సేంజ్ సర్కులర్‌లను విడుదల చేశాయి.
బక్రీద్ సందర్భంగా నేడు (గురువారం) బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపాయి. బులియన్, ఫారెక్స్ మార్కెట్లు కూడా పనిచేయవని, కమొడిటీ మార్కెట్లు సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 11.30 గంటల వరకు పనిచేస్తాయని పేర్కొన్నాయి.
స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం జీవనకాల గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ ఆల్‌టైమ్ రికార్డుస్థాయి రూ. 63,716కి చేరుకోగా, నిఫ్టీ జీవనకాల గరిష్టం రూ.18,908.15 చేరుకుంది. విదేశీ నిధుల ప్రవాహం పెరగడంతో పాటు దేశీయ కొనుగోళ్ల మద్దతుతో చరిత్రలో మొదటిసారిగా సెన్సెక్స్, నిఫ్టీలు జీవనకాల గరిష్టానికి చేరాయి.










