న్యూఢిల్లీ : ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి)కి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు ఓ వైపు ప్రయత్నిస్తూనే మరోవైపు ముస్లింలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించేందుకు సంఫ్‌ు పరివార్, బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బక్రీద్ సందర్భంగా గొర్రెలను కొనుగోలు చేసేందుకు సైతం ముస్లింలు భయపడే పరిస్థితిని కల్పించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోనూ, పారిశ్రామిక నగరం కాన్పూర్‌లోనూ, ఉత్తరాఖండ్‌లోని భొవాలీ నగరంలోనూ నివసిస్తున్న ముస్లింలకు భయపెట్టేలా సందేశాలు పంపుతున్నారు. బక్రీద్ సందర్భంగా గొర్రెలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చినందుకు ముంబయిలోని జెపి ఇన్‌ఫ్రా సొసైటీ ప్రాంతంలో 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో భక్తులుగా చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు కవ్వింపు చర్యలకు దిగుతూ హనుమాన్ చాలీసా పారాయణం మొదలు పెట్టారు. దానిని వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో వైరల్ చేశారు. ఇంకేముంది? వార్తా ఛానల్స్‌కు మేత దొరికింది. హిందూ-ముస్లిం చర్చలు ప్రారంభించాయి. తమ విలేకరులను కొన్ని సొసైటీలలో నియమించి, ఎక్కడైనా గొర్రెలు కన్పిస్తాయేమో చూడండంటూ పురమాయించాయి. అది 'ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం' అట. హిందూత్వకు బ్రాండ్ అంబాసిడర్‌గా చెప్పుకునే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగారు. సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేయాలని, అసాంఘిక శక్తుల ఆట కట్టించాలని అధికారులను ఆదేశించారు. ఆదిత్యనాథ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసు అధికారులు మొరాదాబాద్‌లోని ఓ కాలనీకి చేరుకొని జంతువులేవీ లోపల కన్పించకూడదని హుకుం జారీ చేశారు. ఒకవేళ దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో కులం, మతం ప్రాతిపదికన ఎవరి పైనా వివక్ష చూపబోమంటూ ప్రధాని మోడీ అమెరికాలో చేసిన ప్రకటనను ఈ పరిణామాలు అపహాస్యం చేస్తున్నాయి. బక్రీద్ రోజు ముస్లింలు తమ మత విశ్వాసాలలో భాగంగా గొర్రెలను త్యాగం చేస్తారు. మరి ఇప్పుడు మోడీజీ, యోగీజీ చేస్తున్నదేమిటి? గొర్రెలను కొనుగోలు చేసేందుకే ముస్లింలు భయపడేటట్లు చేస్తున్నారు. గోవా నుండి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వరకూ ఎక్కడ చూసినా ఇదే వాతావరణం.










