డెహ్రాడూన్ : బిజెపి ప్రభుత్వంలో మైనారిటీలపై వివక్ష కొనసాగుతోంది. బక్రీద్ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయకూడదంటూ ముస్లింలపై విశ్వహిందూ పరిషత్ ఆంక్షలు విధించింది. వారి నివాసాల్లో నమాజ్ చేసుకుంటే ఎవరు అడ్డుకుంటారంటూ విహెచ్‌పి వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర రావత్ పేర్కొనడం గమనార్హం. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలోని ముస్లిం వర్గాలు అధికంగా ఉండే పురోలా పట్టణంపై విహెచ్‌పి ఈ ఆంక్షలు విధించింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయకూడదని విహెచ్‌పి బుధవారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించిందని స్థానిక ఎస్‌హెచ్‌ఒ అశోక్ చక్రవర్తి కూడా స్పష్టం చేశారు.
ఇటీవల పురోలాలో మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. మే 26న ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను అపహరించేందుకు యత్నించారని, స్థానికులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ మరుసటి రోజు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఇది లవ్ జీహాద్ ప్రయత్నమంటూ విహెచ్‌పి, బజరంగ్ దళ్‌లు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టాయి. మహాపంచాయత్‌ను అడ్డుకోవడంతో పాటు ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించాయి. ముస్లిం వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి, పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్లాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ 15 రోజుల అనంతరం ముస్లిం వ్యాపారుల దుకాణాలపై పోస్టర్లు వెలిశాయి. అప్పటి నుండి కొందరు ముస్లింలు దుకాణాలు తెరిచేందుకు కూడా భయపడుతున్నారు. 41 ముస్లిం కుటుంబాలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.










