Jul 29,2023 12:14

చెన్నై  :   బంగాళాఖాతంలో చిక్కుకుపోయిన 36 మంది మత్స్యకారులను రక్షించినట్లు భారత నౌకదళం శనివారం తెలిపింది. ఐఎన్‌ఎస్‌ ఖంజర్‌ ద్వారా మత్స్యకారులను రక్షించినట్లు వెల్లడించింది. తమిళనాడు తీరానికి 130 నాటికల్‌ మైళ్ల దూరంలో చిక్కుకుపోయిన 36 మంది భారతీయ మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చిందని నేవీ ప్రతినిధి కమాండర్‌ వివేక్‌ మధ్వల్‌ తెలిపారు.

మత్స్యకారులు మూడు పడవల్లో ఇటీవల చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారని, వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో పాటు ఇంధనం లేకపోవడం, ఇంజిన్‌ సమస్య తలెత్తడంతో వీరి పడవలు నిలిచిపోయాయని అన్నారు. దీంతో వారు రెండు రోజుల పాటు సముద్రంలోనే ఉన్నారని చెప్పారు. ఆ మూడు బోట్లకు తాళ్లు కట్టి 30 గంటలకు పైగా లాక్కుంటూ చెన్నై హార్బర్‌కు తీసుకొచ్చామని, మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంధ్వాల్‌ వెల్లడించారు.