- తుపానులు, వరదలు ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలి
- అధికారులకు సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నైరుతి రుతుపవనాలు ఈ నెల 8 నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణశాఖ అంచనా వేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 4 నాటికి కేరళ రాష్ట్ర తీరాన్ని తాకి 12 నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించే వీలుందన్నారు. రుతుపవన కాలంలో సంభవించబోయే తుపానులు, వరదలను సమర్ధవంతంగా ఎందుర్కొనేందుకు వెంటనే తగిన కార్యాచరణ ప్రణాళికలతో అన్ని విధాలా పూర్తి సన్నద్ధతో ఉండాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నైరుతి రుతుపవనాల సన్నద్ధతపై సచివాలయంలో వివిధ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. సముద్రతీర ప్రాంత మండలాలు, నదీ పరివాహక ప్రాంతాల మండలాల్లో ప్రత్యేకంగా ముందస్తు ఏర్పాట్లతో అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని జవహర్‌రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, మత్స్య, జల వనరులు, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, వైద్యారోగ్య తదితర శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆస్తి, ప్రాణ నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించేందుకు వీలుగా అవసరమైన పరికరాలు, ఇతర సామగ్రిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. గతేడాది తిరుపతి నగరంలో అండర్‌పాస్ వద్ద నీరు నిలిచి ప్రాణ నష్టం జరిగిందని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బలహీనంగా ఉన్న ఏటి, కాలువ, రిజర్వాయర్ల గట్లు, రహదారులపై ఉన్న కల్వర్టులను తనిఖీ చేసి వాటి పటిష్టతకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్టుగార్డు, రైల్వే, టెలీకమ్యూనికేషన్స్ వంటి సంస్థలు విపత్తులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సన్నద్ధతతో ఉండాలని సూచించారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ రుతుపవనాల సన్నద్ధత ఏర్పాట్లపై శాఖల వారీ చేపట్టాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. మెన్ మెటీరియల్‌ను ముందుగానే సిద్ధం చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సిబ్బందికి తగిన శిక్షణ సహాయ చర్యలకు సంబంధించి తగిన టీమ్‌లను ఏర్పాటు చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, శాంతి భద్రతల విభాగం అదనపు డిజిపి శంకభత్ర బాగ్చి, ఎపిఎస్‌పి ఎస్‌డిఆర్‌ఆఫ్ డిఐజి రాజకుమారి, కార్యదర్శి పి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.










