Nov 24,2022 09:43

ప్రజాశక్తి - యంత్రాంగం : అల్పపీడనం ప్రభావంతో బుధవారం తిరుపతి, నెల్లూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. తిరుపతి జిల్లా వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. డ్రెయినేజీలు, కాలువలు పొంగి పొర్లుతుండటంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, కాటేజీలు, రోడ్లు, పార్కులు జలమయమయ్యాయి. చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు చలి తీవ్రత కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో కోవూరు, బుజబుజనెల్లూరు, కసుమూరు, వింజమూరు, ఆత్మకూరు, కొడవలూరు, అల్లూరు, విడవలూరు చెరువులు నిండాయి. పిడుగు పాటుకు నెల్లూరు రూరల్‌ మండలం సౌత్‌మోపూరు గ్రామం బిసి కాలనీకి చెందిన మక్కిన గోవర్ధన్‌ (40) మృతి చెందాడు. పశువులు మోపుతుండగా ఆయనకు సమీపంలో పిడుగుపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.అదే మండలంలోని పొట్టేపాలెం గ్రామానికి చెందిన కందల ధనమ్మ పెన్నానది ఒడ్డున పశువులు మేపుతుండగా పిడుగు పడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.