- పంట పొలాల్లో చేరిన నీరు
- పిడుగుపాటుకు రైతు మృతి
ప్రజాశక్తి-యంత్రాంగం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఆదివారం కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. పైనుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో కృష్ణా నది మరింత ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని గొడ్లవీడు గ్రామానికి చెందిన రైతు చిన్న నారాయణ (60) పిడుగుపాటుకు మృతి చెందారు. పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగు కూడా పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గుంటూరు, ఎన్టిఆర్ జిల్లాల్లో అప్పటికే ఎండ, అప్పటికే వర్షం వంటి వాతావరణం నెలకొంది. గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో దాదాపు 12 మండలాల్లో పత్తి, మిర్చి, వరి పొలాల్లో నీరు చేయడంతో పైర్లు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా తీరంలోని 12 మండలాల పరిధిలో లంక గ్రామాల్లోకి ఉద్యాన పంటలు నీట మునిగాయి. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద కృష్ణా నది పాయకు వరద నీటి ఉధృతితో పల్లపు ప్రాంతాల్లోని లంక పొలాలు నీటమునిగాయి. నదికి ఆవలి ఒడ్డున ఉన్న అరటి, తమలపాకు పంటలను రైతులు పడవలపై మార్కెట్‌కు తరలిస్తున్నారు. పల్లపు ప్రాంతాల్లోని పసుపు, లిల్లీ పూల తోటలు, కంద, చెరకు, అరటి పంటలు నీట మునిగాయి. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట, రావులపాలెం, రామచంద్రపురం మండలాల్లో భారీ వర్షం పడింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి, కరప, కాకినాడ రూరల్, తాళ్లరేవు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్, కడియం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.
- శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీలకు భారీగా వరద నీరు
కృష్ణా నది ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నీటిమట్టాలు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. దీంతో, శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ జూరాల నుంచి 1,55,401 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 66,752 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కులు కలిపి మొత్తం 2,22,270 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో, తొమ్మిది గేట్ల ద్వారా దిగువ నాగార్జున సాగర్‌కు 2,49,786 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు జలవిద్యుత్తు కేంద్రంలో గడిచిన 24 గంటల్లో 27,137 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ 14.650 మిలియన్ యూనిట్ల విద్యుతుత్పత్తి, తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్రంలో 35,315 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ 16.760 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తూ దిగువ సాగరుకు 62,452 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి పోతిరెడ్డిపాడుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 5.09 లక్షల లక్షల క్యూసెక్కులు వస్తుండగా అదే స్థాయిలో సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జు సాగర్ జలాశయానికి వరద స్వల్పంగా తగ్గింది. సాగర్‌కు 3.38 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలకు 4,09,192 క్యూసెక్కులు వస్తుండగా 3,96,201 క్యూసెక్కులను దిగువకు విడిచిపెడుతున్నారు.










