అయ్యా...నరేంద్ర మోడీ గారూ !
ఒక రైతు బిడ్డగా మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నా. మీకు గానీ, మీ అభిమానులకు గానీ నచ్చకపోతే నచ్చ లేదని చెప్పండి, నేను చెప్పినదాంట్లో తప్పేమిటో చర్చించండిగానీ 'దేశద్రోహి' అని ముద్ర వేయటం బాగోదని మీ వారికి చెప్పండి. అయ్యా...ఇక విషయానికి వస్తా! ఉద్యోగాలు రాకపోవటానికి కుర్రాళ్లకు నైపుణ్యం లేదని...పెద్ద ఎత్తున శిక్షణా కేంద్రాలంటూ పెద్ద హడావుడి చేశారు. నైపుణ్యం సంగతి దేవుడెరుగు. ఆ పేరుతో వేల కోట్ల రూపాయలను స్వాహా చేశారు. కొత్త ఉద్యోగులు రాకపోగా ఉన్న ఉపాధి పోయింది. మభ్యపెట్టే కళలో మీకు మాత్రం నైపుణ్యం పెరిగిందన్నది స్పష్టం. ఆ చాతుర్యం గురించి గతంలో మా పెద్దలు ఇందిరా గాంధీ గురించి చెప్పేవారు. ఇప్పుడు మీరు ఆమెను మించిపోయి చెబుతున్నారు.
పార్లమెంట్‌లో ఆమోదించిన వ్యవసాయ సంస్కరణల చట్ట సవరణ బిల్లులు ఒక మూలమలుపు అని మీరు వర్ణించారు. నిజమే అయితే అది రైతులను ముంచేందుకా తేల్చేందుకా అన్నదే సమస్య. అధికారానికి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చెప్పిన మాట చెప్పకుండా, చెప్పినదాని గురించి మరోసారి మాట్లాడకుండా కొత్త విషయాలను జనానికి చెప్పటంలో దిట్టగా మారారు. ఈ విషయంలో మీకు మరొకరు సాటి రారు.
2022-23 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని మీరు గతంలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. ఇంకా రెండున్నర సంవత్సరాల గడువు ఉంది. 2015-16 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఏడు సంవత్సరాల్లో రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలని మీరు ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ తయారు చేసిన పత్రంలో పేర్కొన్నారు. దీనికి గాను ఏటా వృద్ధి రేటు 10.4 శాతం ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు మీరు ఆ ప్రస్తావన లేకుండా కొత్త విషయాలు చెబుతున్నారు. పాత వాగ్దానం మరచిపోయినట్లుగా కనిపిస్తోంది. నల్లధనం అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేశారు. సాధించిందేమిటో మీ నోట మేం వినలేదు. గుజరాత్ తరహా అభివృద్ధి అన్నారు, అదీ అంతే. అచ్ఛే దినాలన్నారు. చచ్చే దినాలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఆ మధ్య మన్‌కీ బాత్‌లో కుక్కలను పెంచాలని పిలుపు ఇచ్చారు. ఆకలో...అన్నమో..రామచంద్రా...అని జనం అంటుంటే పోషకాహారం తినాలని చెప్పారు. ఎమితిని సెపితివి కపితము అన్నట్లుగా అలా ఎందుకు మాట్లాడుతున్నారో, మీకు ఏమైందో అని మేమంతా జుట్టు పీక్కుంటున్నాం.
మాట్లాడితే స్వామినాథన్ పేరు చెబుతారు. కనీస మద్దతు ధరల నిర్ణయంలో ఆయన కమిటీ చేసిన సిఫార్సును గత పాలకులు, మీరూ పట్టించుకోలేదు. నేరుగా (సబ్సిడీ) నగదు బదిలీ పథకం వలన తమ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయని, గతంలో మాదిరే సబ్సిడీ ధరలకే ఎరువులను అందించాలని నీతి ఆయోగ్ తరఫున జరిపిన ఒక సర్వేలో 64 శాతం మంది రైతులు చెప్పినట్లు తేలింది. అయితే దీన్ని అంగీకరిస్తే సబ్సిడీల ఎత్తివేతకు సోపానమైన నేరుగా నగదు బదిలీ పథకాన్ని నిలిపివేయాల్సి వస్తుందని గాకపోతే దాన్ని ఎందుకు అంగీకరించలేదో చెబుతారా? నిరుద్యోగం నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టిందని...గతేడాది పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక ప్రభుత్వ నివేదిక వచ్చింది. పకోడీలు అమ్మేవారికి కూడా ఉపాధి కల్పించినట్లే, అలాంటి వాటిని లెక్కల్లోకి తీసుకోలేదని అప్పుడు చెప్పారు. తరువాత గుట్టుచప్పుడు కాకుండా దాన్నే ఆమోదించారు. నేరుగా సబ్సిడీ బదిలీ సంగతీ అంతే. 'అబ్బే...ఇది సమగ్రమైన సర్వే కాదు, తగినంత మంది లబ్ధిదారులను ప్రశ్నించలేదు' అని నివేదికను తిరస్కరిస్తున్నట్లు 2019 నవంబరు 19న పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు చెప్పించిన మీ చతురతను ఎలా మరచిపోగలం !
జీరో బడ్జెట్, సేంద్రీయ వ్యవసాయం పేరుతో మీ బిజెపితో కలసి పాలన సాగించిన చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఊదరగొట్టారు. అది రైతాంగ ఆదాయాలు రెట్టింపు కావటానికి, రైతులు రుణ విముక్తులు కావటానికి తోడ్పడుతుందని చెప్పారు. ఈ తరహా వ్యవసాయాన్ని చేయించే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు 2018లో పెద్ద హడావుడి చేశారు. 60 లక్షల మంది రైతులు 2024 నాటికి ఎనభై లక్షల ఎకరాల్లో రసాయన ఎరువులు లేని సేంద్రీయ వ్యవసాయాన్ని సాగిస్తారని చెప్పారు. అది ఏమైనట్లు? దేశంలో ఇప్పుడు దాని ఊసే ఎత్తటం లేదేమి? ఆవు పేడ, మూత్రం పేరుతో రాజకీయాలు చేయటం తప్ప మీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా వాటితోనే పంటలు పండిస్తున్నారా ? ఇప్పుడు మీరు చెబుతున్న కార్పొరేట్ లేదా కాంట్రాక్టు వ్యవసాయం ఆవు పేడ, మూత్రంతోనే చేయిస్తారా? అమాయక రైతులం మీరు ఏం చెప్పినా వినక చస్తామా ?
కేంద్ర వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు వీధుల్లోకి వచ్చారు. మార్కెట్లు రద్దయితే ఆదాయం కోల్పోయే వ్యాపారులు దీని వెనుక ఉండి నడిపిస్తున్నారని మీ పార్టీ బిజెపి ప్రచారం చేస్తోంది. ఒక వైపు మార్కెట్లను రద్దు చేస్తామని మేమెక్కడ చెప్పాం అంటారు, ఏంది సారూ ఇది! ఆందోళనకు దిగిన వారు దేశద్రోహులని మీవారే సామాజిక మాధ్యమంలో దాడి చేస్తున్నారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటానికి ప్రధాన కారణం ఈ రంగానికి సబ్సిడీలను రద్దు లేదా గణనీయంగా కోత పెట్టటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకపోవటం, తగిన ధరలు లేకపోవటం, దిగుబడులు పెరగకపోవటం, పరిశోధనలను పక్కన పెట్టటం వంటి అనేక కారణాలు ఉన్నాయి.అందులో వ్యాపారుల దోపిడీ అనేది ఒక కారణం. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని కూడా తగ్గించవచ్చు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించాలి కనుక ఏదో ఒక సాకు చూపాలి. రైతులకు ప్రత్యక్షంగా కనిపించేది వ్యాపారులు, వారి అక్రమాలే కనుక వారిని చూపి మీరు చేయదలచుకున్నది చేస్తున్నారు తప్ప మరొకటి కాదని అనుకుంటున్నాం. పార్లమెంటులో మాదిరి వ్యవసాయ చట్టాలను మా మీద రుద్దటం సాధ్యం కాదని సవినయంగా మనవి.
ఇక్కడ మరో విషయాన్ని కూడా చెప్పాలి. మార్కెట్ యార్డుల వెలుపల వాణిజ్య లావాదేవీలు జరిపితే వ్యాపారులు పన్ను చెల్లించాలి. ఇప్పుడు మీరు మార్కెట్ యార్డులతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా వ్యాపారులు కొనుగోలు చేయవచ్చు అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఈ బిల్లులకు మద్దతు ఇచ్చే విషయంలో తెలుగుదేశంతో పోటీ పడి మరీ మద్దతు ఇచ్చారు. జగన్ నవరత్నాల అమలుకు ఇప్పటికే డబ్బు లేదు. ఇప్పుడు మార్కెట్ల ఆదాయం కూడా పోతే ఏం చేస్తారో తెలియదు. ఆదాయ నష్టానికి కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వదు మరి. సీత కష్టాలు సీతవి- పీత కష్టాలు పీతవి అన్నట్లుగా జగన్ కష్టాలు జగన్‌వి పాపం!
ఆంధ్రప్రదేశ్‌ను మీరూ కాంగ్రెస్ మరికొన్ని పార్టీలు కలసి పోటీబడి విభజించాయి. అప్పుడు నా సామిరంగా పార్లమెంటులో మీ వెంకయ్య నాయుడు, సుష్మ స్వరాజ్ వంటి నేతలు చేసిన హడావుడి, అబ్బో చూడవలసిందేగానీ చెప్పతరం కాదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు పెడతామని మన్మోహన్ సింగ్ చెబితే మీ వెంకయ్య నాయుడు హడావుడి చేసి ఐదును పదేళ్లకు ఒప్పించటానికి చెమటోడ్చాల్సి వచ్చినట్లు చెప్పారు. తరువాత మీరు తిరుపతి లోనూ అదే చెప్పారు. తీరా జరిగిందేమిటి? ప్రత్యేక హోదా లేదూ పాడూ లేదు. కాంగ్రెస్ నేతలు విభజన చట్టంలో పెట్టి ఉంటే సాధ్యమయ్యేది. నేరం వారిదే అంటూ తప్పించుకున్నారు. దాని గురించి మరోసారి మాట్లాడవద్దని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇప్పటి సి.ఎం జగన్ మోహన్ రెడ్డి గారికీ తెగేసి చెప్పారు.
పార్లమెంట్‌లో చర్చనూ విస్మరించారు. నిత్యం దేవుడి గురించి చెప్పే మీరు వెంకన్న సాక్షిగా చేసిన వాగ్దానాన్నీ ఖాతరు చేయలేదు. వ్యవసాయ చట్ట సవరణల్లో కనీస మద్దతు ధర గురించి, పంటల సేకరణ హామీలను చేర్చకుండా బిల్లులను ఆమోదించారు. మరోవైపు అబ్బే అవేమీ రద్దు కావని నమ్మమంటున్నారు. ఒక్క మాట అడిగితే ఏమనుకోరుగా సారూ! మీరు దేవుడని మా వెంకయ్య నాయుడు గారు గతంలో వర్ణించారు. జిఎస్‌టి విషయంలో కేంద్రం-రాష్ట్రాల మధ్య చట్టబద్ధమైన ఒప్పందం కుదిరింది. ఐదేళ్ల పాటు పన్ను ఆదాయం తగ్గితే కేంద్రం భర్తీ చేస్తుందని దానిలో అంగీకరించారు. దేవుడి లీల కారణంగా తగినంత ఆదాయం రాలేదు కనుక కేంద్రం చేసేదేమీ లేదు, కావాలంటే అప్పులిప్పిస్తాం. అప్పు ఎలా కావాలో తేల్చుకోండి అన్నారు మన నిర్మలమ్మ. అదేంటి సారూ...మీరు దేవుడై ఉండి ఇంతవరకు మాట్లాడలేదు. పోనీ అదేం నిర్మలమ్మా అలా మాట్లాడావేమిటి, ఆ లీల లేదా పాపం నాకు అంటుకోదా అని అంతర్గతంగా అయినా ప్రశ్నించినట్లు లీకుల వార్తలు కూడా రాలేదు.
నిత్యావసర సరకుల చట్టాన్ని కూడా సవరించారు. ఏ సరుకును ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు. విపరీతంగా ధరలు పెరిగినపుడు మాత్రమే ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నారు. ఇదేంటి సారు, నిల్వ చేసుకొనేందుకు అవకాశం ఇవ్వటం ఎందుకు, ధరలు విపరీతంగా పెరిగేంతవరకు చోద్యం చూడటం ఎందుకు? అప్పుడు ఆంక్షలు ఎందుకు? దీన్నే మేం నక్క పోయిన తరువాత బొక్క కొట్టటం అంటాం. మేం పంటలు పండిస్తాం. వినియోగదారులంగా కూడా ఉంటాం. అంటే మా పంటలను మేమే అదానీ, అంబానీ, అమెజాన్‌లకు అమ్ముకోవాలి. తర్వాత వారి దగ్గర నుంచి అధిక ధరలకు కొనుక్కోవాలా ఏంది సారూ. దీన్నే గోడ దెబ్బ చెంప దెబ్బ అనుకుంటాం మేం. పాలనా జోక్యం తక్కువ పేరుతో మమ్మల్ని ఉత్పత్తిదారులుగా, వినియోగదారులుగా కార్పొరేట్లకు అప్పగిస్తూ...చట్టాలు చేసి...మీ చేతులు మీరు దులుపుకొనిపోతే రేపు మాగతేంగాను? జిఎస్‌టి మాదిరే రేపు మాకు సైతం అన్యాయం జరిగితే, అప్పుడు కూడా అంతా దైవ లీల, విధి వైపరీత్యం, మనం నిమిత్త మాత్రులం, దేవుడు ఆడించినట్లు ఆడటం, అనుభవించటం తప్ప విధి లేదా తల రాత మార్చలేం అంటే మా గతేంగాను సారూ?
మీ భవదీయుడు
ఎం. కోటేశ్వరరావు










